IND Vs WI : సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్.. గెలిచి నిలిచిన భారత్
విండీస్‌తో టీ20 సిరీస్ గెలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల మ్యాచుల సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ తో రాణించడంతో విండీస్ నిర్ధేశించిన లక్ష్యాన్ని అలవోకగా భారత్ చేధించింది. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బ్రెండన్ కింగ్ 42 బంతుల్లో (5ఫోర్లు, 1 సిక్స్) 42 పరుగులు, రావ్‌మన్ పావెల్ 19 బంతుల్లో ( 3 సిక్సర్లు, 1 ఫోర్) 40 నాటౌట్ గా నిలిచి ఫర్వాలేదనిపించారు.
సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
లక్ష్య చేధనకు దిగిన భారత్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి విజయం సాధించింది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత సూర్యకుమార్ 44 బంతుల్లో (10ఫోర్లు, 4 సిక్సర్లు) 83 పరుగులు, తిలక్ వర్మ 37 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్) 49 నాటౌట్ గా నిలిచి విజృంభించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 87 పరుగులు జోడించడం విశేషం. వెస్టిండీస్ బౌలర్లలో జోషెఫ్ రెండు, ఒబెడ్ మెక్కాయ్ ఒక వికెట్ తీశారు. హాఫ్ సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో 2-1 తేడాతో విండీస్ ముందంజలో ఉంది.