విండీస్‌తో టీ20 సిరీస్.. యువ ప్లేయర్స్‌కు ఛాన్స్! బరిలో రింకూసింగ్
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపటి నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ ముగిసిన అనంతరం టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. ఈ సిరీస్ లు జూలై-ఆగస్టు మధ్యలో జరగనున్నాయి. ముఖ్యంగా టీ20 సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో ఐపీఎల్ లో అదరగొట్టిన రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. వెటరన్ పేసర్ మోహిత్ శర్మ కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా
వెస్టిండీస్ తో జరిగే టీ20 సిరీస్ కు టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా నియామకం కానున్నట్లు సమాచారం. అదే విధంగా వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించారు. వచ్చే ఏడాది జరగనున్న టీ 20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని యువ క్రికెటర్లను బీసీసీఐ తయారు చేసే పనిలో పడింది. ఐపీఎల్ లో సత్తా చాటిన యువ ప్లేయర్లు ఒకవేళ అంతర్జాతీయ టీ20ల్లో ఎంట్రీ ఇస్తే ఎలా రాణిస్తారో వేచి చూడాల్సిందే.