India Vs Nepal: సూపర్-4లో భారత్.. నేపాల్ పై టీమిండియా ఘన విజయం
ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. వర్షం వల్ల అంతరాయం కలిగిన మ్యాచులో టీమిండియా 10 వికెట్ల తేడాతో నేపాల్ పై ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా డీఎల్ఎస్ ప్రకారం భారత్ టార్గెట్ ను 23 ఓవర్లకు 135 రన్స్ గా నిర్ణయించగా, భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ (74*), శుభ్‌మాన్ గిల్(67*) చెరో అర్ధ సెంచరీ చేసి విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో భారత్ సూపర్-4కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. భారత్ ఈ లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది.
సెప్టెంబర్ 10న భారత్-పాక్ మధ్య మ్యాచ్
ఇక గ్రూప్-ఏ నుంచి పాకిస్థాన్ కూడా సూపర్ 4లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ను ఆంపైర్లు అందించారు. సూపర్ -4 దశలో దయాది జట్లు మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి. గ్రూప్-ఏలో టాపర్ గా నిలిచిన పాక్, రెండో స్థానంలో భారత్ సెప్టెంబర్ 10న కోలంబోలో తలపడనున్నాయి. అంతకుముందు పాక్ జట్టు నేపాల్ పై గెలుపొందింది. దీంతో భారత్, పాక్ ఖాతాలో చెరో 3 పాయింట్లు లభించాయి. పాకిస్థాన్ కు రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో గ్రూప్ లో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది.