Team India: టెస్టుల్లో టీమిండియా దూకుడు.. సిక్సర్లలో ప్రపంచ రికార్డు
టీమిండియా టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన ఘనతను సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్ 2022లో 29 ఇన్నింగ్స్‌లలో 89 సిక్స్‌లు బాదగా, టీమిండియా కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే 90 సిక్స్‌లు బాది ఆ రికార్డును బద్దలుకొట్టింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఫీట్‌ను సాధించింది. ఇక భారత జట్టు మరిన్ని సిక్స్‌లు బాదే అవకాశం ఉండటంతో 100 సిక్సుల మార్క్‌ను సునాయసంగా అందుకోనుంది. ఈ రికార్డును సాధించడంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కీలకపాత్ర పోషించారు.
వేగంగా 50 పరుగుల రికార్డు కూడా భారత జట్టుదే
వీరిద్దరూ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (23; 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆకట్టుకోగా, యశస్వి జైస్వాల్ (72; 51 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్, యశస్వి జోడీ ఆరంభంలోనే జోరుగా ఆడి 18 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసింది. దీంతో టెస్టు క్రికెట్‌లో వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డు ఇంతకుముందు ఇంగ్లాండ్ పేరిట ఉండేది, ఆ జట్టు 26 బంతుల్లో ఈ ఫీట్‌ను సాధించింది.