Page Loader
GT vs MI: టాప్-2లో లేని జట్లు టైటిల్ గెలిచిన దాఖలాలివే..! ముంబయి, గుజరాత్‌కు కలిసొచ్చేనా?
టాప్-2లో లేని జట్లు టైటిల్ గెలిచిన దాఖలాలివే..! ముంబయి, గుజరాత్‌కు కలిసొచ్చేనా?

GT vs MI: టాప్-2లో లేని జట్లు టైటిల్ గెలిచిన దాఖలాలివే..! ముంబయి, గుజరాత్‌కు కలిసొచ్చేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2025 సీజన్‌ తుది దశకు చేరుకుంది. మే 29 నుంచి ప్లే ఆఫ్స్‌ ప్రారంభంకానుండగా, నేడు ముల్లాన్‌పుర్ వేదికగా కీలక క్వాలిఫయర్-1 మ్యాచ్‌ జరగనుంది. పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలిచిన పంజాబ్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. అదే వేదికపై రేపు (మే 30) గుజరాత్ టైటాన్స్‌, ముంబయి ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌ జరగనుంది. ఈ రెండు మ్యాచుల అనంతరం, క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ విజేతలు క్వాలిఫయర్-2లో పోటీపడి, విజేత ఫైనల్‌ టికెట్ సాధిస్తుంది.

Details

ప్లే ఆఫ్స్‌ చరిత్రను ఓసారి తెలుసుకోండి

2011లో ప్లే ఆఫ్స్‌ మోడల్‌ను ఐపీఎల్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 14 సీజన్లు పూర్తయ్యాయి. వీటిలో కేవలం ఒకే ఒక్క సారి మాత్రమే ఎలిమినేటర్ మ్యాచ్‌ గెలిచిన జట్టు చివరికి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2016లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది. మొదట ఎలిమినేటర్‌లో కోల్‌కతాను, తర్వాత క్వాలిఫయర్-2లో గుజరాత్ లయన్స్‌ను ఓడించిన హైదరాబాద్, ఫైనల్‌లో బెంగళూరుపై 8 పరుగుల తేడాతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది.

Details

ముంబయికి మూడు, నాలుగు స్థానాల్లో చేదు అనుభవాలు

పాయింట్ల పట్టికలో మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లకు టైటిల్‌ దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ముంబయి ఇండియన్స్ 10 సార్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి, ఐదు సార్లు విజేతగా నిలవగా, ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. కానీ మూడు, నాలుగు స్థానాల్లో నుంచి టైటిల్‌ గెలవలేకపోయింది. 2011, 2012లో క్వాలిఫయర్-2 వరకూ వెళ్లినా ఫైనల్‌కు చేరలేదు. 2014, 2023లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనే నిష్క్రమించింది.

Details

గుజరాత్ టైటాన్స్ గ్రాఫ్‌

గుజరాత్ టైటాన్స్‌ 2022లో తొలిసారి ఐపీఎల్‌ ఆడింది. అదే ఏడాది టైటిల్‌ గెలిచింది. తర్వాత 2023లో రన్నరప్‌గా నిలిచింది. కానీ 2024లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం నాకౌట్ మ్యాచ్‌ల్లో నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది.

Details

కొత్త చాంపియన్‌ వచ్చే అవకాశముందా?

ఈ సీజన్‌లో ముంబయి లేదా గుజరాత్ టైటాన్స్ జట్లలో ఒకటి క్వాలిఫయర్-2లో ఆడనుంది. అయితే క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, క్వాలిఫయర్-2లో ఈ జట్లలో ఏదో ఒకదాన్ని ఓడిస్తే, ఈసారి కొత్త చాంపియన్‌ను చూసే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండూ ఇప్పటివరకు ఒక్కసారైనా టైటిల్‌ గెలవలేకపోయాయి. బెంగళూరు మూడు సార్లు ఫైనల్‌ చేరినా (2009, 2011, 2016) గెలవలేకపోయింది. పంజాబ్ కింగ్స్‌ 2014లో ఫైనల్‌ చేరి కోల్‌కతా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం టైటిల్ ఆశ గట్టిగానే ఉంది.