Ishan Kishan: 'బజ్‌బాల్' క్రికెట్‌పై ఇషాన్ కిషన్ ఏమన్నారంటే?
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. టెస్టు క్రికెట్ చరిత్రలో 74 బంతుల్లోనే వంద పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. కేవలం 24 ఓవర్లలోనే 181/2 స్కోరును భారత్ చేసింది. ఈ నేపథ్యంలో 'బజ్‌బాల్' క్రికెట్ కు టీమిండియా అలవాటు పడిందా అనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో మొదలైంది. ఈ విషయంపై తాజాగా ఇషాన్ కిషన్ స్పందించారు. టెస్టు క్రికెట్లో ప్రతిసారి వేగంగా ఆడాల్సిన అవసరం లేదని, పరిస్థితిని బట్టి పరుగులను చేయాలని ఇషాన్ కిషన్ చెప్పారు.
యువ క్రికెటర్లను కెప్టెన్ రోహిత్ శర్మ ప్రోత్సహిస్తారు : ఇషాన్ కిషన్
పిచ్ ను బట్టి పరిస్థితులను అనుగుణంగా ఆడాలని, పిచ్ ను అర్ధం చేసుకుంటే పరుగులను చేయగలమని, అయితే టీమిండియా ప్లేయర్లకు ఏ ఫార్మాట్లో ఎలా ఆడాలనే దానిపై అవగాహన ఉందని ఇషాన్ కిషన్ పేర్కొన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ యువ క్రికెటర్లకు బాగా ట్రీట్ చేస్తాడని, అనవసరంగా ఒత్తిడి పెట్టకుండా సౌకర్యంగా ఆడేందుకు అవకాశం ఇస్తాడని చెప్పుకొచ్చారు. రెండో ఇన్నింగ్స్ లో నాలుగో స్థానంలో తాను ఆడినప్పుడు ఒత్తిడికి గురి కావద్దని రోహిత్ సూచించారని, అలా కెప్టెన్ మన మీద భరోసా ఉంచినప్పుడు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందని ఇషాన్ వివరించారు.