టీమిండియాకు అదే పెద్ద మైనస్.. ఈసారీ వరల్డ్ కప్‌లో పాక్ గెలుస్తుంది: పాక్ మాజీ క్రికెటర్
ఈ ఏడాది భారత్, పాకిస్థాన్ జట్లు కనీసం రెండుసార్లు తలపడనున్నాయి. మొదట వన్డే ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ టోర్నీలో టీమిండియా, పాక్ తలపడనుండగా, భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ టోర్నీలో మరోసారి ఈ రెండు జట్లు మధ్య పోరు జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రపంచ కప్ టూరు ముందు పాకిస్థాన్ ఆటగాడు సయీద్ అజ్మల్ టీమిండియాపై హాట్ కామెంట్స్ చేశాడు. టీమిండియా బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందని, ఈ ప్రపంచ కప్‌లో భారత్‌ను పాకిస్థాన్ ఓడిస్తుందని సయీద్ అజ్మల్ పేర్కొన్నాడు. ఈ ప్రకటనపై భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా బౌలింగ్ బలంగా లేదు
ఇటీవల సిరాజ్, షమీ బాగా బౌలింగ్ చేస్తున్నారని, రవీంద్ర జడేజా వన్డే ప్రపంచకప్ లో టీమిండియాకు కీలకమని, జస్ప్రిత్ బుమ్రా పాక్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని, అయితే అతను ఫామ్ లో లేరని సయీద్ అజ్మల్ అన్నారు. కాబట్టి భారత్ బౌలింగ్ పాకిస్థాన్‌ను దెబ్బతీస్తుందని తాను అనుకోవడం లేదని, కానీ భారత్ బ్యాటింగ్ ఎప్పుడు బలంగా ఉంటుందని, పాకిస్థాన్ లోని బౌలర్లను చూస్తుంటే భారత్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసే అవకాశం ఉందని వివరించారు. అదే విధంగా ఇండియా వన్డే జట్టులోని మరో ఇద్దరు ముఖ్యమైన సభ్యులైన శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ కూడా గాయపడి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.