Dilip: భారత ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపిన ఫీల్డింగ్ కోచ్.. మన తెలుగోడే!
వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి ఆనంతరం జట్టు సభ్యులంతా డ్రెస్సింగ్ రూంలో నిరాశగా కూర్చున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం వాళ్లని అభినందిస్తూ, వారిలో స్ఫూర్తిని నింపి అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన వ్యక్తి మెడలో ఓ పతకాన్ని వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాతో ఫైనల్ ఓడిపోయాక ఎప్పటిలాగే ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను అందించారు. చివరి మ్యాచులో విరాట్ కోహ్లీ అద్భుంగా ఫీల్డింగ్ చేసినట్లు ప్రకటించారు. దిలీప్ హైదరాబాద్‌కు చెందిన మాల్కాజ్ గిరి వాస్తవ్యుడు కావడం విశేషం.
దిలీప్ ను ఎంపిక చేసిన ద్రావిడ్
హైదరాబాద్ అండర్-25 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిలీప్, పిల్లలకు ట్యూషన్లు చెబుతూ క్రికెట్ ఆడేవాడు. తర్వాత NCA లెవెల్ 1, లెవల్ 2 కోచ్ శిక్షణ పూర్తి చేసి, లెవల్ 3 శిక్షణలో జాతీయ స్థాయిలో నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇక భారత్ అండర్-19, మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. India-Aకు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సమయంలో దిలీప్ క్రమశిక్షణ ద్రావిడ్‌కు ఎంతో నచ్చింది. ఎన్‌సీఏలో సీనియర్ ఫీల్డింగ్ కోచ్‌లు ఉన్న కూడా ద్రావిడ్, దిలీప్ వైపే మొగ్గు చూపాడు. మరోవైపు India-A జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక కావడం దిలీప్ కెరీర్‌లోనే పెద్ద మలుపు అని చెప్పొచ్చు.