Page Loader
IND vs ENG 1st Test: మూడ్రోజుల్లో మ్యాచ్ ముగియవచ్చు.. తొలి టెస్టుకు ముందు పిచ్‌పై క్యూరేటర్ కీలక ప్రకటన
మూడ్రోజుల్లో మ్యాచ్ ముగియవచ్చు.. తొలి టెస్టుకు ముందు పిచ్‌పై క్యూరేటర్ కీలక ప్రకటన

IND vs ENG 1st Test: మూడ్రోజుల్లో మ్యాచ్ ముగియవచ్చు.. తొలి టెస్టుకు ముందు పిచ్‌పై క్యూరేటర్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లీలో ప్రారంభం కానుంది. మ్యాచ్‌కు ముందే పిచ్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. కొన్ని వర్గాలు బౌలర్లకు తోడ్పాటు ఉన్న పిచ్‌గా అభివర్ణించగా, మరికొందరు బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా మారనుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హెడింగ్లీ పిచ్ క్యూరేటర్ రిచర్డ్ రాబిన్సన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Details

మ్యాచ్ మూడు రోజుల్లో ముగుస్తుందా?

జూన్ 16న రాబిన్సన్ మీడియాతో మాట్లాడుతూ, గత టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్ తరహాలో మ్యాచ్ పూర్తిగా ఐదు రోజుల పాటు సాగాలని ఆకాంక్షించారన్నారు. బ్యాట్, బంతి మధ్య సమతుల్యత ఉండేలా పిచ్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. పిచ్‌లో సీమ్, బౌన్స్ ఉన్నప్పటికీ తొలి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు అయినా కనీసం 300 పరుగులు చేయగలగాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

Details

గడ్డి తగ్గించాం.. తేమ పెంచాం

పిచ్ ప్రస్తుతం గ్రీన్ టాప్‌లా కనిపిస్తున్నప్పటికీ, క్యూరేటర్ ప్రకారం గడ్డిని తగ్గించబోతున్నారట. "ఇక్కడ వాతావరణం వేడిగా ఉంది. ప్రారంభంలో కొంత తేమ వదిలి, పిచ్ 5 రోజులు నిలబడేలా నీటిని పోస్తున్నాం. ఇది మూడు రోజుల్లో ముగిసే టెస్ట్ కాకూడదని కోరుకుంటున్నా," అని రాబిన్సన్ తెలిపారు. మ్యాచ్ మొదలైన కొద్దిసేపట్లో బౌలర్లకు సహాయం అందుతుందనీ, ఆ తర్వాత వికెట్ కొంచెం ఫ్లాట్ అవుతుందని అంచనా వేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేసిన జట్టు మెరుగైన స్థితిలో ఉంటుందన్నారు.

Details

కొత్త జట్టుతో భారత్ బరిలోకి

ఈ సిరీస్‌కి భారత జట్టు యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు రిటైర్మెంట్ తీసుకున్న నేపథ్యంలో, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ లాంటి యువ ఆటగాళ్లపై సెలెక్టర్లు నమ్మకాన్ని ఉంచారు. శుభ్‌మాన్ గిల్ జట్టుకు కెప్టెన్‌గా, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. జడేజా, బుమ్రా, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు కూడా జట్టులో ఉన్నారు. యువ ఆటగాళ్లపై ఇప్పుడు భారీ బాధ్యత పడినట్టు అయ్యింది. ఈ నేపథ్యంతో తొలి టెస్ట్ ఎలా సాగనుంది? పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది? యువ భారత్ ఎలా రాణిస్తుంది? అన్నదానిపై ఆసక్తి పెరిగింది.