
IPL 2025: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లు?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల తీవ్రత పెరిగిన నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మిగిలిన మ్యాచ్‌లు తాత్కాలికంగా నిలిపివేశారు.
దేశంలోని ఉత్తర, పశ్చిమ సరిహద్దు రాష్ట్రాల్లో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో, మిగిలిన 16 మ్యాచ్‌లను దక్షిణ భారతంలోని నగరాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు వేస్తోంది.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికలుగా ఉండే అవకాశముందని సమాచారం. అయితే, కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతే ఈ ప్రణాళికలకు స్పష్టత రానుంది.
Details
వారం పాటు వాయిదా
ప్రస్తుతం బీసీసీఐ ఐపీఎల్‌ను ఒక వారంపాటు తాత్కాలికంగా వాయిదా వేసింది.
కానీ వాస్తవంగా వారం తర్వాత కూడా మ్యాచ్‌లను మళ్లీ ప్రారంభించడంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని సంబంధిత ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో 2025 సీజన్ మిగిలిన భాగాన్ని ఈ ఏడాది చివర్లోకి వాయిదా వేసే అవకాశాలు కూడా పరిశీలనలో ఉన్నట్లు క్రీడా వర్గాలు అంటున్నాయి.
Details
విదేశీ ఆటగాళ్లు దూరమయ్యే ఛాన్స్
భారతదేశం నుంచి విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. వారిలో కొంతమందికి త్వరలో అంతర్జాతీయ టెస్ట్ షెడ్యూల్స్ కూడా ఉన్నాయి.
ఉదాహరణకు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు జూన్ 11 నుంచి టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ మళ్లీ మొదలైతే, ఆ దేశాలకు చెందిన కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు.
ఈ పరిణామాల వల్ల ఐపీఎల్ 2025 భవిష్యత్‌పై అనేక అనిశ్చితులు నెలకొన్నాయి. పరిస్థితులు మెరుగైన దిశగా సాగితేనే ఆఖరి నిర్ణయం వెలువడనుంది.