IND Vs SA : మా ఓటమికి కారణం ఇదే.. ఇదొక మంచి గుణపాఠం : సూర్యకుమార్ యాదవ్
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచులో సూర్య సేన ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-1 తేడాతో వెనుకబడింది. ఇక చివరి టీ20ల్లో టీమిండియా (Team India) తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఓటమిపై స్పందించాడు. మెరుగైన స్కోరు సాధించినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. భారత బౌలింగ్ చేసేటప్పుడు బంతి విపరీతంగా జారిపోయిందని, ఇదే తమ ఓటమికి కారణమని సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు.
మూడో టీ20ల్లో తప్పకుండా రాణిస్తాం
తమ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత 180 స్కోరు సరిపోతుందని భావించామని, అయితే దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా ఆడారని పేర్కొన్నారు. తొలి ఐదారు ఓవర్లలోనే మ్యాచును సౌతాఫ్రికా ఆటగాళ్లు లాగేసుకున్నారని చెప్పారు. తాము బౌలింగ్ చేసేటప్పుడు బంతి చేతుల్లో నుంచి జారిపోయిందని, బంతి తడిసిపోవడంతో పట్టు దొరకలేదన్నారు. ఇలాంటి మ్యాచ్ తమకు మంచి గుణపాఠమవుతుందని, మూడో టీ20ల్లో తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేస్తామని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో షంసి తన నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి సూర్యకుమార్‌ను ఔట్ చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.