ఆస్ట్రేలియా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురిపై వేటు
యాషెస్ రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో స్టంపౌట్ వివాదానికి సంబంధించి ఆస్ట్రేలియా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురిని మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఎంసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భవిష్యతులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది. గ్రీన్ ఓవర్ లో బెయిర్ స్టో చివరి బంతిని ఆడకుండా వదిలేశాడు. అలాగే ఓవర్ ముగిసిందనే ఆలోచనతో బెయిర్ స్టో క్రీజు వదిలి స్టోక్స్ వైపు వెళ్లాడు. వెంటనే కేరీ బంతిని స్టంప్స్‌కు కొట్టి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. దీన్ని మూడో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దురుసుగా ప్రవర్తించిన సభ్యుల గుర్తింపు
ఆస్ట్రేలియా ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టేడియంలోని అభిమానులు ఆస్ట్రేలియా ఆటగాళ్లను హేళన చేస్తూ చాలాసేపు అరుస్తూనే ఉన్నారు. అయితే లంచ్ విరామంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎంసీసీ హౌస్ మీదుగా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్తుతున్నప్పుడు క్లబ్ సభ్యులు కొందరు వారితో గొడవకు దిగారు. ఖావాజాను సభ్యులు వెనక్కి లాగుతూ, వార్నర్ తో వాగ్వివాదానికి దిగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దురుసుగా ప్రవర్తించిన సభ్యులపై ఎంసీసీ చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారం పట్ల ఎంసీసీ విచారం వ్యక్తం చేసింది.