Rohit Sharma: భారత వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో ముగ్గురు ప్లేయర్లు.. ఎవరంటే?
వన్డే వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడిన టీమిండియా మరోసారి ఫైనల్ గండాన్ని దాటలేకపోయింది. ఈ టోర్నీలో ముఖ్యంగా రోహిత్ శర్మ (Rohit Sharma) ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా పది మ్యాచుల్లో జట్టును గెలిపించిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓటమి రోహిత్ గుండె పగిలేలా చేసింది. ఈ టోర్నీ తర్వాత కెప్టెన్‌గా అతని ఫ్యూచర్‌పై కూడా చర్చ మొదలైంది. రోహిత్ వయస్సు 36 ఏళ్లు. 2027లో సౌతాఫ్రికాలో జరిగే వచ్చే వరల్డ్ కప్ నాటికి 40 ఏళ్లు నిండుతాయి. ఈ లెక్కన వన్డే వరల్డ్ కప్‌లో అతని ప్రయాణం ముగిసిందని చెప్పొచ్చు. అతని స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు పోటీలో ఉన్నారు.
ముందు స్థానంలో కేఎల్ రాహుల్?
వన్డే కెప్టెన్సీలో రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేఎల్ రాహుల్ పోటీపడుతున్నాడు. అతనికి జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది. ముఖ్యంగా మైదానంలో పరిస్థితులకు తగ్గట్లు ఉండగలడు. ఒత్తిడిలో కూడా కూల్‌గా ఉంటూ మ్యాచ్ విజయానికి కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషిస్తాడు. వన్డే ప్రపంచ టోర్నీలో టీమిండియాకు హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పాండ్యాలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నా, ఫిట్ నెస్ సమస్యలతో అతను సతమతమవుతున్నాడు. సెలక్షన్ కమిటీ కెప్టెన్‌గా పాండ్యా పరిగణలోకి తీసుకొనే అవకాశాలు లేకపోలేదు. దిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ బరిలో నిలిచాడు. ఐపీఎల్‌లో తన నాయకత్వ లక్షణాలతో ఎన్నోసార్లు విజయాన్ని కూడా అందించాడు.