Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. తృటిలో రోహిత్ రికార్డు మిస్!
టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో వెస్టిండీస్‌తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20ల్లో తిలక్ వర్మ ఈ రికార్డును నెలకొల్పాడు. తెలుగు ఆటగాడు తిలక్ ఈ మ్యాచులో 41 బంతుల్లో (5ఫోర్లు, 1 సిక్సర్) 51 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డును తిలక్ బద్దలు కొట్టాడు. 20ఏళ్ల 271 రోజుల వయస్సులోనే తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ లో హాఫ్ సెంచరీని బాదిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. రిషబ్ పంత్ 21 ఏళ్ల 38 రోజుల వయస్సులో ఈ ఫీట్‌ను సాధించాడు.
అగ్రస్థానంలో రోహిత్ శర్మ
20ఏళ్ల 143 రోజుల వయస్సులోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ అరుదైన మైలురాయిని తిలక్ తృటిలో మిస్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్‌లో అదరగొట్టిన తిలక్ వర్మ, టీ20ల్లోనూ విజృంభిస్తున్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచులో 39 పరుగులు చేయగా, రెండో టీ20ల్లో 51 పరుగులు చేశాడు. ఇదే ఫామ్ ను తిలక్ వర్మ కొనసాగిస్తే టీ20ల్లో తన స్థానం నిలబెట్టుకోవడం ఖాయమని చెప్పొచ్చు