Asian Games: భారత్ స్వర్ణం గెలవడంలో టిటాస్ సాధు కీలక పాత్ర .. ఆమె ఎవరు..?
ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో గెలుపొంది, పసిడి సొంతం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 117 పరుగుల లక్ష్య చేధనలో లంక, 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో భారత బౌలర్ టిటాస్ సాధు మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ యువ పేసర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3/6తో రాణించింది. పశ్చిమ బెంగాల్ లోని చిన్సురా జిల్లాకు చెందిన టిటాస్ సాధు సెప్టెంబర్ 29, 2004న జన్మించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని టిటాస్ సాధు
స్ప్రింటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, క్రికెట్ లో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. 2023లో భారత మహిళల U-19 ప్రపంచ కప్ విజేత జట్టులో కూడా టిటాస్ సాధు పాల్గొంది. సాధు ఆ టోర్నీలో ఆరు వికెట్లు పడగొట్టింది. తర్వాత ఇంగ్లండ్‌పై నాలుగు ఓవర్లలో 2/6తో రాణించి, POTM అవార్డును గెలుచుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.25 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ ఫ్రాంచేజీ తరుఫున ఆమె ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు.