WI vs IND: ఇండియా, విండీస్ జట్ల మధ్య రేపే టీ20 మ్యాచ్.. గెలుపు ఎవరిదో?
వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్, ప్రస్తుతం టీ20 సమరానికి సిద్ధమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 3 నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా క్రికెట్ అకాడమీలో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు జరగనుంది. భారత జట్టుకు హార్ధిక్ పాండ్యా, విండీస్ జట్టుకు రోవ్‌మన్ పావెల్ నాయకత్వం వహించనున్నారు. టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్లో 1,675 పరుగులు చేశాడు. పరుగల పరంగా శిఖర్ ధావన్(1759) అధిగమించడానికి 84 పరుగుల దూరంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. హార్ధిక్ పాండ్యా టీ20 ఫార్మాట్లో 4500 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 152 పరుగుల దూరంలో నిలిచాడు.
అరుదైన రికార్డుకు చేరువలో యుజేంద్ర చాహల్
20 ఓవర్ల ఫార్మాట్‌లో భారత్, విండీస్ జట్లు 25 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 17 విజయాలను నమోదు చేయగా.. విండీస్ ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. రైట్ ఆర్మ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 20 ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటివరకూ 91 వికెట్లను పడగొట్టాడు. ఇక 100 వికెట్ల క్లబ్ చేరడానికి అతను 9 వికెట్లు తీయాలి. కుల్దీప్ యాదవ్ 50 వికెట్లు మైలురాయిని చేరుకోవడానికి నాలుగు వికెట్లు దూరంలో ఉన్నాడు. నికోలస్ పూరన్ టీ20 ఫార్మాట్లో 25.18 సగటుతో 1,486 పరుగులు చేశాడు. 1,500-ప్లస్ మైలురాయిని అందుకుంటే విండీస్ ఆ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా పూరన్ నిలవనున్నాడు.