Siraj Vs Travis Head: ట్రావిస్ హెడ్, సిరాజ్‌లపై ఐసీసీ సీరియస్ !?
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు విజయం కన్నా ఎక్కువగా ట్రావిస్ హెడ్,మహ్మద్ సిరాజ్‌ల మధ్య జరిగిన వాగ్వాదం హైలెట్ అయ్యింది. రెండవ రోజు ఆట సందర్భంగా ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. సెంచరీతో రెచ్చిపోయిన ట్రావిస్ హెడ్(140)ను సిరాజ్ ఒక అద్భుతమైన బంతితో బౌల్డ్ చేసి, పెవిలియన్‌కు పంపించాడు. సిరాజ్ మంచి ఊపుమీద ఉన్న సమయంలో హెడ్‌ను పెవిలియన్‌కు వెళ్లాలంటూ సైగ చేశాడు. హెడ్ బౌల్డ్ అయిన తరువాత,అతడు సిరాజ్‌ను ఏదో అనడంతో అది కెమెరాలో రికార్డయింది.ఈ విషయంపై రెండో రోజు ఆట తరువాత వారిద్దరూ వివరణ ఇచ్చారు.
ఐసీసీ సీరియస్
హెడ్ మాట్లాడుతూ, "నేను సిరాజ్‌ను బాగా బౌలింగ్ చేసినందుకు మెచ్చుకున్నాను. కానీ అతడు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు" అన్నారు. సిరాజ్ మాత్రం, "హెడ్ అబద్ధం చెబుతున్నాడు" అని పేర్కొన్నాడు. దీంతో ఈ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో,అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వీరిద్దరిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని సమాచారం అందింది. 'ది డైలీ టెలిగ్రాఫ్' నివేదిక ప్రకారం, సిరాజ్,హెడ్ ఇద్దరూ ఐసీసీ క్రమశిక్షణా విచారణను ఎదుర్కొంటారని తెలుస్తోంది. కానీ,ఐసీసీ ప్రవర్తనా నియమావళిని వీరిద్దరూ పూర్తి స్ధాయిలో ఉల్లఘించకపోవడంతో సస్పెన్షన్ నుంచి తప్పించుకోనున్నారు. ఇదంతా ఇరు జట్లకూ బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. చివరికి, ఐసీసీ వీరిద్దరినీ కేవలం మందలింపుతో విడిచిపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.