
Olympics 2028: క్రీడలలో ట్రాన్స్‌జెండర్లు మహిళలతో పోటీపడకుండా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
పారిస్ ఒలింపిక్స్ సమయంలో అల్జీరియా కి చెందిన బాక్సర్ ఇమానే ఖెలిఫ్ అంశం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది. మహిళల బాక్సింగ్ పోటీల్లో ఆమెకు అనుమతి ఇవ్వడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులు మహిళల విభాగంలో పోటీ పడడం సబబేనా? అంటూ పెద్దఎత్తున చర్చ జరిగింది. . అయితే,రాబోయే ఒలింపిక్స్ పోటీలు 2028లో లాస్‌ఏంజెలెస్‌లో జరగనున్న నేపథ్యంలో అలాంటి వివాదాలు అక్కడ తలెత్తకపోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ట్రాన్స్‌జెండర్ల విషయంలో అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు చాలా గట్టిగా వ్యవహరిస్తూ వచ్చింది. సైన్యంలో ట్రాన్స్‌జెండర్ లక్షణాలను కలిగినవారిని పక్కన పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
వివరాలు
నిధుల వినియోగంపై పునఃపరిశీలన చేస్తామని హెచ్చరికలు
ఇదే విధంగా క్రీడలలో కూడా ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులు మహిళల విభాగాల్లో పోటీ పడకూడదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ ఆదేశాన్ని మద్దతు ఇస్తూ యూఎస్ ఒలింపిక్ కమిటీ (USOC) తమ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించింది. అంతేకాకుండా, ఈ విషయాన్ని అన్ని దేశాలకు చెందిన క్రీడా పాలనా సంస్థలకు తెలియజేసింది. ఈ నిబంధనలను ఎవరు ఉల్లంఘించే ప్రయత్నం చేసినా, ఆ సంస్థలకు నిధుల వినియోగంపై పునఃపరిశీలన చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసింది.
వివరాలు
ఇతర దేశాల్లోని క్రీడా సంస్థలు కూడా తమ పాలసీలను నవీకరించుకోవాలి
"ఫెడరల్ వ్యవస్థలో భాగమైన సంస్థగా, మేము ఆ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత మాతో ఉంది. మా సవరణ విధానం ప్రకారం మహిళలకు సమానమైన, భద్రమైన పోటీ వాతావరణాన్ని కల్పించడం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం. ఇతర దేశాల్లోని క్రీడా సంస్థలు కూడా తమ పాలసీలను నవీకరించుకోవాలి" అని యూఎస్ ఒలింపిక్ కమిటీ సీఈవో సారా హిర్ష్‌లాండ్, అధ్యక్షురాలు జెనె సైక్స్ ఓ లేఖలో వెల్లడించారు. వ్యక్తిగత క్రీడా సమాఖ్యలకు స్వతంత్ర నిబంధనల స్వీకారానికి ఐవోసీ అవకాశం కొత్త అధ్యక్షురాలైన కిర్‌స్టీ కోవెంట్రీ నాయకత్వంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) మహిళల అర్హతను కీలక అంశంగా భావిస్తోంది.
వివరాలు
ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు సంబంధించిన నిబంధనలను మారుస్తూ ఎన్‌సీఏఏ నిర్ణయం
అయితే, ఒలింపిక్ పోటీల సందర్భంలో ప్రతి క్రీడా విభాగానికి చెందిన సమాఖ్యలు తమకిష్టమైన విధంగా స్వంత నియమాలు తయారు చేసుకునేందుకు ఐవోసీ అవకాశం కల్పించింది. ఇప్పటికే కొన్ని క్రీడా సంఘాలు ఈ అంశంపై స్పందించి చర్యలు చేపట్టాయి. అమెరికాలోని ఎన్‌సీఏఏ (NCAA) సంస్థ ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు సంబంధించిన నిబంధనలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బాలికల,మహిళల క్రీడా విభాగాల నుంచి ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులను నిషేధించే ప్రక్రియలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులను అనుసరిస్తూ ఎన్‌సీఏఏ కూడా మార్పులు తీసుకురావడం గమనార్హం.