Peddi : రామ్ చరణ్ అభిమానులకు ఊహించని షాక్.. 'పెద్ది' విడుదల వాయిదా!
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను నిరాశపరిచే వార్త ఒకటి బయటకు వచ్చింది. 'గేమ్ ఛేంజర్' తర్వాత ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' విడుదల వాయిదా పడింది. మొదట వేసవి కానుకగా మార్చి 27న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్రకటించారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. సినిమా విడుదలను దాదాపు ఎనిమిది నెలలు ముందుకు జరపడానికి ప్రధాన కారణం సాంకేతిక అంశాలేనని సమాచారం. ముఖ్యంగా గ్రాఫిక్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉండటంతో, అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం భావిస్తోంది.
Details
అత్యున్నత ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం
రామ్ చరణ్ కెరీర్లోనే భిన్నమైన పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాను విజువల్‌గా అత్యున్నత ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు బుచ్చి బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మార్చిలో చరణ్‌ను వెండితెరపై చూడాలని ఎదురుచూసిన అభిమానులకు ఈ వాయిదా వార్త నిరాశ కలిగించినప్పటికీ, దీని వెనుక ఒక సానుకూల కోణం కూడా ఉంది. హడావిడిగా సినిమా విడుదల చేయడం కంటే, మరింత మెరుగ్గా తీర్చిదిద్ది ఒక మాస్టర్‌పీస్‌గా అందించాలన్నదే టీమ్ లక్ష్యం.
Details
భారీ వసూళ్లు సాధించే అవకాశం
డిసెంబర్ అంటే క్రిస్మస్, ఇయర్ ఎండ్ సీజన్ కావడంతో బాక్సాఫీస్ పరంగా కూడా ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన లుక్, మేకోవర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం చరణ్ ఎంతో కష్టపడుతున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.