Hasaranga: వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు రిటైర్మెంట్
శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా 26 ఏళ్లకే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ కు హసరంగ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని అతడు మంగళవారం శ్రీలంక క్రికెట్‌కు తెలియజేశారు. వన్డే, టీ20లపై ఫోకస్ చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు శ్రీలంక బోర్డు కూడా ఆమోదం తెలిపింది. తాము హసరంగా నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం తమకు ఉందని శ్రీలంక బోర్డు సీఈఓ ఆష్లే డి సిల్వా పేర్కొన్నారు. పరిమిత ఓవర్ల జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న హసరంగా, టెస్టుకు మాత్రం గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు.
2021లో చివరిసారిగా టెస్టు మ్యాచును ఆడిన హసరంగ
ఇప్పటివరకూ హసరంగా 48 వన్డేల్లో 832 పరుగులు చేసి 67 వికెట్లను పడగొట్టాడు. ఇక 58 టీ20ల్లో 533 పరుగులు చేసి 91 వికెట్లను తీశాడు. కేవలం నాలుగు టెస్టులు ఆడి 196 పరుగులతో పాటు 4 వికెట్లను సాధించాడు. హసరంగా 2021లో బంగ్లాదేశ్ పై చివరిసారిగా టెస్టు మ్యాచును ఆడారు. 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగ్రేటం చేశారు. ఐపీఎల్‌లో హసరంగా ఆర్సీబీ తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లంక్ ప్రీమియర్ లీగ్‌లో బీలవ్ కాండీ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.