
Karun Nair: రికార్డులతో హోరెత్తిస్తోన్న కరుణ్ నాయర్.. జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడా?
ఈ వార్తాకథనం ఏంటి
ఎనిమిదేళ్ల క్రితం భారత క్రికెట్లో అతడి ఇన్నింగ్స్ ఒక సంచలనం! కారణం, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయగలిగింది అతడే. కానీ ఆ తర్వాత అతను మళ్లీ పెద్దగా కనిపించలేదు. దేశవాళీ క్రికెట్‌లో కొన్ని మెరుపులు మెరిపించినప్పటికీ, జాతీయ జట్టులో స్థానం మాత్రం దక్కలేదు. కానీ 2024-25 సీజన్‌లో అతడు భీకరంగా ఆడుతూ, జాతీయ జట్టులోకి రావడానికి బలంగా తలపడుతున్నాడు. అతడే కరుణ్ నాయర్. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఈ కర్ణాటక సీనియర్ బ్యాటర్, సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లలో భారత జట్టులో స్థానం దక్కించుకునేందుకు రేసులో నిలిచాడు.
వివరాలు
7 మ్యాచ్‌ల్లో 750+ పరుగులు!
దేశవాళీ క్రికెట్‌లో యువ ఆటగాళ్లు మెరిసినా, 33 ఏళ్ల కరుణ్ నాయర్ యువ ఆటగాళ్లకు దీటుగా ఆడుతూ పరుగుల వరద సృష్టిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోర్నమెంట్‌లో 7 మ్యాచ్‌ల్లో 752 పరుగులు సాధించడం ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో ఇంత స్థిరంగా ఆడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో అయిదు సెంచరీలు సాధించడమే అతడి జోరును తెలిపే విషయం. అతడి స్కోర్లు: 112 నాటౌట్, 44 నాటౌట్, 163 నాటౌట్, 112, 122 నాటౌట్, 88 నాటౌట్. బౌలర్లు అతడిని ఔట్ చేయడంలో విఫలమయ్యారు. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ అతడే ఆధిపత్యం చెలాయిస్తున్నాడు.
వివరాలు
12 మ్యాచ్‌ల్లో 560 పరుగులు
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే టోర్నీలో సాధించిన అత్యధిక పరుగుల రికార్డును (660) నాయర్ తిరగరాశాడు. ఒక సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. కరుణ్ ఫామ్ గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది. కర్ణాటక మహారాజా టీ20 ట్రోఫీలో 12 మ్యాచ్‌ల్లో 560 పరుగులు చేయడం, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోర్నీలో 6 ఇన్నింగ్స్‌ల్లో 255 పరుగులు సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం.
వివరాలు
పునరాగమనంపై దృష్టి
భారత టెస్ట్ జట్టు కూర్పులో ఇప్పుడు గందరగోళం కొనసాగుతోంది. సీనియర్లు రోహిత్, విరాట్ రాణించలేకపోతుండగా, కుర్రాళ్లు కూడా నిరాశపరుస్తున్నారు. మిడిల్ ఆర్డర్‌లో పుజారా, రహానే లాంటి సీనియర్ల స్థానంలో లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో రాబోయే టెస్ట్ సిరీస్‌లో కరుణ్ నాయర్‌ను పరీక్షిస్తే తప్పేమీ ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక సీనియర్ బ్యాటర్ ఫామ్‌లో ఉంటే జట్టుకు సమతూకం కలుగుతుందని చెబుతున్నారు.
వివరాలు
నాయర్ మరోసారి భారత జెర్సీ ధరించే అవకాశాలు
కరుణ్ నాయర్ ఇంగ్లాండ్‌పై మంచి రికార్డు కలిగి ఉన్నాడు. అతడి ట్రిపుల్ సెంచరీ కూడా ఆ జట్టుపైనే. అయితే అతడి పునరాగమనం సాకారం కావాలంటే రంజీ సీజన్‌లో ఇదే జోరును కొనసాగించాల్సి ఉంటుంది. బ్యాక్‌ఫుట్‌లో ఆడడం అతడి బలం. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో అతడి నైపుణ్యం జట్టుకు ఉపయోగపడుతుంది. కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచనలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరం. ఒకవేళ ఆయన సానుకూలంగా ఉంటే, నాయర్ మరోసారి భారత జెర్సీ ధరించే అవకాశాలు ఉన్నాయి.