Page Loader
Vijay Hazare Trophy: మూడు వికెట్లతో మెరిసిన మహమ్మద్ షమీ..ఫిట్‌నెస్‌పై అనుమానాలకు తెర! 
మూడు వికెట్లతో మెరిసిన మహమ్మద్ షమీ..ఫిట్‌నెస్‌పై అనుమానాలకు తెర!

Vijay Hazare Trophy: మూడు వికెట్లతో మెరిసిన మహమ్మద్ షమీ..ఫిట్‌నెస్‌పై అనుమానాలకు తెర! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి దాదాపు 14 నెలలుగా దూరంగా ఉన్న ఏ ఆటగాడికైనా జట్టులో స్థానం కోసం పోటీ చేయడం చాలా కష్టం. అతని కెరీర్‌ దాదాపు ముగిసినట్లే అనిపిస్తుంది. ఫిట్‌నెస్‌ పరంగా సరైన స్థాయిలో లేకపోవడం, స్థిరమైన ప్రదర్శన లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. అయితే, టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami)మాత్రం అలా కాదు.. రోజురోజుకూ మరింత ప్రమాదకరమైన బౌలర్‌గా మారిపోతూ,తన ఫిట్‌నెస్‌ను పునరుద్ధరించుకుని ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. బీసీసీఐ సెలక్టర్లకు తన ప్రదర్శనతో సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో (Vijay Hazare Trophy)షమీ తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించాడు. బెంగాల్ తరపున హరియాణాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి తన సత్తా చాటాడు.

వివరాలు 

ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనడం ఖాయమా? 

పది ఓవర్ల స్పెల్‌లో 61 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదు, ముందు రౌండ్ 7 మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై కూడా చక్కటి ప్రదర్శన కనబరిచాడు.42 పరుగులు ఇచ్చి ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్‌ పడగొట్టాడు. షమీ ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌ విషయంలో మంచి స్థాయిలో ఉన్నాడు. అయినప్పటికీ,అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో తీసుకుంటారా లేదా అనేది వేచిచూడాల్సి ఉంటుంది. గతంలో ఆసీస్‌ పర్యటనకు ముందు దేశవాళీ క్రికెట్‌లో రాణించిన షమీ,బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి సిద్ధమయ్యాడు. కానీ, మోకాలిలో వాపు రావడంతో సెలక్టర్లు అతడిని జట్టులోకి తీసుకోలేదు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ, ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ రాణిస్తూ తన ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపర్చుకుంటున్నాడు.

వివరాలు 

బుమ్రా ఆడటంపై సందిగ్ధం

ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రధాన పేసర్‌గా ఆడాలని షమీ బలంగా కోరుకుంటున్నాడు. ఇంకొవైపు జస్ప్రిత్ బుమ్రా జట్టులోకి రావడంపై సందిగ్ధం నెలకొంది. అతడికి స్క్వాడ్‌లో అవకాశం వచ్చినా, ఫిట్‌నెస్‌ పరంగా సరిగా ఉంటేనే తుది జట్టులో ఆడిస్తామని బీసీసీఐ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల్లో షమీకి అవకాశం వస్తే, అతను ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటం కూడా ఖాయమవుతుంది. ఐసీసీ టోర్నీలలో షమీ చెలరేగే బౌలర్ అని గత వన్డే ప్రపంచకప్‌లోనూ తక్కువ మ్యాచ్‌లు ఆడినా అత్యధిక వికెట్లు తీసిన ఘనత అతడికే దక్కింది. షమీ తన ప్రదర్శనతో మరోసారి టీమిండియాకు ప్రధాన బలంగా నిలుస్తాడేమో చూడాలి.