Virat Kohli: వన్డేల్లో సచిన్ కంటే విరాటే గ్రేట్ : ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖావాజా
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి అందనంత ఎత్తులో ఉన్నాడు. 77 అంతర్జాతీయ సెంచరీలు చేసి సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తర్వాతి స్థానంలో కోహ్లీ నిలిచాడు. వన్డేల్లో 100 సెంచరీల రికార్డే లక్ష్యంగా దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ వన్డేల్లో మాత్రం మాస్టర్ రికార్డులను అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మానా ఖావాజా, విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డేల్లో సచిన్ కంటే విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని ఖావాజా అభిప్రాయపడ్డాడు. వన్డేల్లో సచిన్ కంటే విరాట్ కోహ్లీనే మెరుగ్గా కనిపిస్తున్నాడని, సచిన్ కంటే అద్భుతంగా రాణిస్తారని పేర్కొన్నాడు.
కోహ్లీ అందరిలోనూ స్ఫూర్తిని నింపుతాడు : ఉస్మాన్
సచిన్ ఆడిన మ్యాచుల కంటే విరాట్ కోహ్లీ ఆడిన వన్డేల సంఖ్య చాలా తక్కువ అని, ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన కంటూ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడని ఉస్మాన్ ఖావాజా(Usman Khawaja) తెలిపాడు. వన్డేల్లో కోహ్లీ గ్రేటర్ రన్ ఛేజర్ అని, అతని నిలకడైన ప్రదర్శన చూస్తే ముచ్చటేస్తుందని వెల్లడించారు. ప్లేయర్స్ విరాట్‌తో కలిసి ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారని, చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉండాలని సంకల్పించుకొని జట్టులోకి కోహ్లీ వచ్చాడని చెప్పాడు. కోహ్లీ ప్లేయర్స్ అందరిలోనూ స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగుతాడని పొగడ్తల వర్షం కురిపించాడు.