Virat Kohli: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్.. లండన్ నుంచి నేరుగా చెన్నై చేరుకున్న కోహ్లీ
బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈమ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనుంది.ఆటగాళ్లు చెపాక్‌కి చేరుకుంటున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ కూడా లండన్ నుంచి నేరుగా చెన్నైకి చేరుకున్నాడు. కోహ్లీ ఈ రోజు వేకువజామున 4 గంటలకు చెన్నైకి చేరుకుని,హోటల్ గదికి వెళ్లిపోయాడు. దాదాపు 18నెలల తర్వాత అతను స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు.అతను చివరిసారిగా 2023 మార్చిలో భారత్‌లో టెస్ట్ ఆడాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో ఈ సిరీస్‌కి తిరిగి వచ్చాడు.ఈరోజు లేదా రేపటిలోగా క్యాంప్‌లో ఇతర ఆటగాళ్లతో కలిసే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ క్రికెటర్లు జస్‌ప్రీత్ బుమ్రా,రవీంద్ర జడేజా కూడా చెన్నై చేరుకున్నారు.
కోహ్లీ అరుదైన ఘనత
బంగ్లాదేశ్‌తో జరిగే ఈ టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ మరో 58 పరుగులు చేసినట్లయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగుల మైలురాయిని చేరిన వేగవంతమైన బ్యాటర్‌గా నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, కోహ్లీ కేవలం 591 ఇన్నింగ్స్‌లలో 26,942 పరుగులు చేశాడు. మొత్తం 27,000 పరుగులకుపైగా చేసిన ఆటగాళ్లలో ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే ఉన్నారు: సచిన్ (34,357), కుమార సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483).