Virat Kohli-Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధిస్తారు : భారత మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత జట్టుకు వీరిద్దరూ కలిసి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. అయితే నాలుగేండ్లకోసారి జరిగే ప్రతిష్ఠాత్మక ఒలిపింక్స్‌లో ఎన్నో ఆటలు ఉన్నా, ప్రపంచంలోనే అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న క్రికెట్ లేకపోవడం మాత్రం క్రీడాభిమానులకు పెద్ద లోటు అనిపించేది. ఎట్టకేలకు 2028 లాస్ ఏజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయాలని అంతర్జాతీయ ఒలిపింక్ సంఘం నిర్ణయించింది. తాజాగా ఈ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ స్పందించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ఒలింపిక్ పతకాన్ని సాధించాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పాడు.
విరాట్, రోహిత్‌పై ప్రశంసలు
ఇటీవల ముగిసిన 19వ ఆసియా గేమ్స్‌లో భారత ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపింది. ఈ టోర్నీలో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించి సత్తా చాటింది. 2028 ఒలింపిక్స్‌కు ఐదేళ్ల సమయం ఉందని, అప్పటికి జట్లు అన్ని అభివృద్ధి చెందుతాయని, భారత జట్టు పతకం కావాలంటే, ప్రధాన జట్టును ఈ టోర్నీకి పంపాలని వాసన్ పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లకు అవకాశం వస్తే ఒలింపిక్ పతకాన్ని సాధిస్తారని, వారు ఆ దిశగా కృషి చేస్తారని వాసన్ వెల్లడించారు. 2028 ఒలింపిక్స్‌లో ఈసారి సాఫ్ట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ వంటి క్రీడలకు కూడా ఉంటాయి.