Page Loader
Virat Kohli : ఛాంపియన్స్ ట్రోఫీలో అరుదైన రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లి
ఛాంపియన్స్ ట్రోఫీలో అరుదైన రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లి

Virat Kohli : ఛాంపియన్స్ ట్రోఫీలో అరుదైన రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 మరో కొద్దీ రోజుల్లో ప్రారంభం కానుంది. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అంతేకాదు, ప్రపంచ క్రికెట్ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. ప్రస్తుతం అందరి దృష్టి టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మీదే. ఈ పరుగుల యంత్రం ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో అర్థ శతకంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో తన ఫామ్‌ను కొనసాగిస్తాడని అందరూ ఆశిస్తున్నారు.

వివరాలు 

కోహ్లీ కొత్త రికార్డుల దిశగా... 

కోహ్లీకి ఇది నాలుగో ఛాంపియ‌న్స్ ట్రోఫీ. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 529 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో వ్యక్తిగా కొనసాగుతున్నాడు. అయితే, ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలవాలంటే కోహ్లీకి మరో 173 పరుగులు అవసరం. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో.. అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు 1. శిఖర్ ధావన్ - 701 2. సౌరవ్ గంగూలీ - 665 3. రాహుల్ ద్రవిడ్ - 627 4. విరాట్ కోహ్లీ - 529

వివరాలు 

ఓవర్‌ఆల్ ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డు 

భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2013, 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీల్లో అద్భుత ప్రదర్శనతో 701 పరుగులు చేశాడు. ముఖ్యంగా 2013లో టీమిండియా విజయంలో ధావన్ కీలక భూమిక పోషించాడు. 2017లో భారత్ ఫైనల్‌ చేరినప్పటికీ, పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. ధావన్ తర్వాత భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రెండో స్థానంలో ఉన్నాడు. 13 మ్యాచ్‌ల్లో 665 పరుగులు చేయగా, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 19 మ్యాచ్‌ల్లో 627 పరుగులు సాధించాడు.

వివరాలు 

కోహ్లీ ఆ రికార్డును అధిగమించాలంటే..

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల రికార్డు వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పేరిట ఉంది (791 పరుగులు). కోహ్లీ ఆ రికార్డును అధిగమించాలంటే 263 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోహ్లీకి చివరిదై ఉండే అవకాశముంది. తదుపరి ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2029లో జరగనుండగా, అప్పటివరకు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగడమా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో కోహ్లీ కొత్త రికార్డులు సృష్టిస్తాడా? వేచి చూడాలి!