విరాట్ కోహ్లి vs సచిన్ టెండూల్కర్.. వీరి వన్డే రికార్డులపై ఓ లుక్కేద్దాం!
టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లెక్కలేనన్ని రికార్డులను సాధించాడు. ఇప్పటికి అతని పేరు మీద ఎన్నో చెక్కు చెదరని రికార్డులు ఉన్నాయి. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే కొన్ని సచిన్ రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరి వన్డే గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ పై 122 పరుగుల చేసిన కోహ్లీ, వన్డేల్లో అత్యధిక వేగంగా 13వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అదేవిధంగా వన్డేల్లో తన 47వ సెంచరీని కూడా నమోదు చేశాడు. 267 ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 13వేల మైలురాయిని చేరుకోగా, సచిన్ 321 ఇన్నింగ్స్ లో ఆ ఫీట్‌ను అధిగమించాడు.
అత్యంత వేగంగా 25వేల పరుగులు చేసిన కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 25వేల పరుగులు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు. కేవలం 549 ఇన్నింగ్స్ లోనే కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. ఈ విషయంలో టెండూల్కర్ (577),రికీ పాంటింగ్ (588), జాక్వెస్ కలిస్ (594), కుమార సంగక్కర 608 ఇన్నింగ్స్ లో 25వేల మార్కును దాటారు. కోహ్లి 326 ఇన్నింగ్స్‌లలో 53 సెంచరీలు చేయగా, ఆస్ట్రేలియన్ లెజెండ్ పాంటింగ్ 439 ఇన్నింగ్స్‌ల నుండి 55 సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లి 100-ప్లస్ స్ట్రైక్ రేట్‌తో వన్డేల్లో 15 సెంచరీలను చేసి అగ్రస్థానంలో నిలిచాడు. డివిలియర్స్ 100-ప్లస్ స్ట్రైక్ రేట్‌తో 12 సెంచరీలు చేసిన రెండో స్థానంలో ఉండగా.. ఎనిమిది సెంచరీలతో టెండూల్కర్ మూడో స్థానంలో ఉన్నాడు.
పాకిస్థాన్ పై అత్యధిక సెంచరీలు చేసిన సచిన్
పాకిస్థాన్‌పై సచిన్ 69 వన్డేల్లో 40.09 సగటుతో 2526 పరుగులు చేశాడు. ఇందులో పాక్ పై ఐదు సెంచరీలు చేశాడు. కోహ్లీ 15 వన్డే మ్యాచుల్లో 55.16 సగటుతో 662 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలున్నాయి. వన్డే క్రికెట్‌లో సచిన్ 6,976 పరుగులతో స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి నిలవగా, విరాట్ కోహ్లీ స్వదేశంలో వన్డేల్లో 5,447 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. స్వదేశంలో వన్డేల్లో 5,406 పరుగులతో పాంటింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. టెండూల్కర్ 463 మ్యాచ్‌లలో 49 సెంచరీలను బాదగా, కోహ్లీ 279 మ్యాచుల్లో 47 సెంచరీలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.