సెలక్షన్ కమిటీ చీఫ్ పదవిపై వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నారంటే?
టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా జట్టుపై గతంలో భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడిని ఆ పదవి నుంచి బీసీసీఐ తొలగించింది. సెలెక్షన్ కమిటీ సమావేశాల్లో మరో సెలెక్టర్ శివ సుందర్ పాల్ తాత్కాలికంగా ఈ బాధ్యతలను చేపట్టాడు. నార్త్ జోన్ నుంచి సెలెక్టర్ పదవి ఖాళీ కావడంతో ఆ స్థానాన్ని వీరేంద్ర సెహ్వాగ్‌తో భర్తీ చేస్తున్నట్లు ఈ మధ్య జోరుగా వార్తలొచ్చాయి. ఈ పదవి కోసం తాజాగా బీసీసీఐ దరఖాస్తులను అహ్వానించింది. నార్త్ జోన్ చీఫ్ సెలెక్టర్ పదవి నిర్వర్తించే సత్తా సెహ్వాగ్ కు మాత్రమే ఉందని కొందరు చెబుతున్నారు. వీటిపై తాజాగా సెహ్వాగ్ క్లారిటీ ఇచ్చాడు.
బీసీసీఐ ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు
బీసీసీఐ తనకు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని, బయటికొస్తున్న పుకార్లను నమ్మకూడదని సెహ్వాగ్ తేల్చి చెప్పాడు. వాస్తవానికి బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌కు వార్షిక వేతనం కింద రూ.కోటి, కమిటీలో ఉండే మిగిలిన నలుగురికి రూ.90 లక్షలు బీసీసీఐ ఇవ్వనుంది. కానీ వీరు అంత తక్కువ వేతనానికి తాను రాలేనని బీసీసీఐతో చెప్పినట్లు కూడా వార్తలొచ్చాయి. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో శ్రీధరన్ శరత్ (సౌత్ జోన్), సుబ్రతో బెనర్జీ (సెంటర్ జోన్), సలిల్ అంకోలా (వెస్ట్ జోన్) లతో పాటు తాత్కాలిక చీఫ్ సెలక్టర్ గా శివ సుందర్ దాస్ కొనసాగుతున్నారు. సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఐదేళ్ల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలి.