IPL 2024 Auction : ఐపీఎల్‌లో తొలి మహిళా ఆక్షనీర్.. ఎవరీ మల్లికా సాగర్?
ఐపీఎల్(IPL) 2024 సీజన్‌కు ముందు మినీ వేలం మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దుబాయిలోని కోకాకోలా ఎరెనా వేదికగా జరిగిన వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు పది జట్లు పోటీపడ్డాయి. అయితే వేలంలో ఓ మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పురుషుల ఐపీఎల్ చరిత్రలో మల్లికా సాగర్ (Mallika Sagar) అనే ఓ మహిళ వేలం ప్రక్రియను నిర్వహించడం ఇదే తొలిసారి. అంతకుముందు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలం నిర్వహకురాలిగా ఆమె వ్యవహరించారు.
2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం ప్రక్రియను నిర్వహించిన మల్లికా సాగర్
ఐపీఎల్ టోర్నీ ప్రస్థానం ప్రారంభమైన 2008 నుంచి 2018 వరకు రిచర్డ్ మ్యాడ్లీ ఆక్షనీర్‌గా వ్యవహరించారు. అనంతరం 2018 నుంచి గతేడాది వరకు హ్యూ ఎడ్మిడ్స్ ఆక్షన్‌ను నడిపించారు. ఇక ఈ ఏడాది మల్లికా సాగర్ ఐపీఎల్ వేలం ప్రక్రియను నడిపించనున్నారు. ముంబయికి చెందిన మల్లికా సాగర్, ఆధునిక, సమకాలీన భారత కళాకృతుల కన్సల్టెంట్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. 48 ఏళ్ల మల్లిక ఫిలడెల్ఫియా (అమెరికా)లో ఆర్ట్ హిస్టరీ పూర్తి చేశారు. క్రీడల విభాగంలో గతంలో కూడా ఆమె వేలం నిర్వహించారు. 2021 ప్రొ కబడ్డీ లీగ్ వేలం ప్రక్రియ నిర్వహించి ప్రశంసలు అందుకుంది. హ్యూగ్ ఎడ్మీడ్స్ వీడియోలు చూసి తాను క్రికెట్ వేలం గురించి నేర్చుకున్నానని అన్నారు.