Page Loader
Vipraj Nigam: ఢిల్లీ క్యాపిటల్స్ కు దొరికిన ఆల్ రౌండర్ విప్రజ్ నిగమ్ ఎవరు? 
ఢిల్లీ క్యాపిటల్స్ కు దొరికిన ఆల్ రౌండర్ విప్రజ్ నిగమ్ ఎవరు?

Vipraj Nigam: ఢిల్లీ క్యాపిటల్స్ కు దొరికిన ఆల్ రౌండర్ విప్రజ్ నిగమ్ ఎవరు? 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2025
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

లక్నో సూపర్‌జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్ విప్రాజ్‌ నిగమ్‌ తన అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. బౌలింగ్‌లో కీలకమైన మార్‌క్రమ్‌ వికెట్‌ను సాధించడమే కాకుండా,బ్యాటింగ్‌లోనూ మెరుపు వేగంతో పరుగులు చేసి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు. దిల్లీ క్యాపిటల్స్‌ చివరికి ఒక వికెట్‌ తేడాతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌ విప్రాజ్‌కు ఐపీఎల్‌లో తొలి ప్రదర్శన కావడం విశేషం.అరంగేట్ర మ్యాచ్‌లోనే జట్టుకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దిల్లీ 113/6తో కష్టాల్లో ఉన్నప్పుడు,13వ ఓవర్లో విప్రాజ్‌ క్రీజులోకి వచ్చి కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు.

వివరాలు 

యూపీ టీ20తో వెలుగులోకి.. 

అంతర్జాతీయ నాణ్యత కలిగిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను సైతం ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో అశుతోష్‌తో కలిసి కీలకమైన 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విప్రాజ్‌ను దిల్లీ జట్టు ఈ ఏడాది జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. 2024 యూపీ టీ20 టోర్నమెంట్‌లో అతడు అదరగొట్టడంతో దిల్లీ ఫ్రాంచైజీ దృష్టిలో పడ్డాడు. యూపీ ఫాల్కన్స్‌ తరఫున 12 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసి తన ప్రతిభను చాటాడు. దేశవాళీ క్రికెట్‌లో 2024-25 సీజన్‌లో తొలిసారిగా అతను ఉత్తర్‌ప్రదేశ్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో ఎంపికయ్యాడు. ఇప్పటివరకు మూడు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, ఐదు లిస్ట్-ఎ గేమ్‌లు,ఎనిమిది టీ20లు ఆడాడు.

వివరాలు 

మూడు రంజీ మ్యాచ్‌ల్లో 13 వికెట్లు 

పశ్చిమ బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు కీలకమైన వికెట్లు తీసి అందరిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో వ్రిద్ధిమాన్‌ సాహా వికెట్‌ కూడా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు తీసి, మొత్తం మూడు రంజీ మ్యాచ్‌ల్లో 13 వికెట్లు సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 2024 కర్నల్ సీకే నాయుడు ట్రోఫీ ఫైనల్‌లోనూ అద్భుతంగా రాణించి అండర్-23 జట్టులో చోటు సంపాదించాడు.

వివరాలు 

బ్యాట్స్‌మన్ నుంచి లెగ్‌ స్పిన్నర్‌గా మారిన ప్రయాణం 

2004లో జన్మించిన విప్రాజ్‌ తన అండర్-19 వరకూ ప్రధానంగా బ్యాటింగ్‌లోనే మెరుగుపడ్డాడు. కానీ, క్రమంగా లెగ్‌స్పిన్‌లో నైపుణ్యం సాధించి బౌలింగ్‌లోనూ మెరిపించడం ప్రారంభించాడు. టీమ్‌ఇండియా మిస్టరీ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ప్రకారం, విప్రాజ్‌ బంతికి మంచి టర్నింగ్‌ ఇవ్వడంలో ప్రత్యేకంగా శ్రమించి తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. అంతేకాకుండా, బ్యాటింగ్‌లోనూ అతడు భారీ షాట్లు ఆడటంలో వెనుకంజ వేయడు. అతడి హిట్టింగ్‌ సామర్థ్యం ఆశ్చర్యపరిచిందని కుల్దీప్‌ పేర్కొన్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

15 బంతుల్లోనే 39 పరుగులు చేసిన విప్రజ్ నిగమ్