
Fauja Singh: 114 సంవత్సరాల వయసులో మరణించిన అతి పెద్ద మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయస్సులో ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం మధ్యాహ్నం జలంధర్-పఠాన్‌కోట్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించినా, రాత్రి 7:30 గంటల సమయంలో ఫౌజా సింగ్ మృతి చెందారు. ఫౌజా సింగ్ మృతదేహాన్ని విదేశాల్లో నివసిస్తున్న ఆయన పిల్లలు వచ్చే వరకు మార్చురీలో ఉంచనున్నారు. వారు వచ్చిన తర్వాతే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఫౌజా సింగ్ మృతిపై పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా సంతాపం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫౌజా కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతిని తెలియజేశారు. ఫౌజా ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
వివరాలు
'నాషా ముక్త్ - రంగాలా పంజాబ్' మార్చ్‌లో ఫౌజాతో పాటు..
114 ఏళ్ల వయస్సులోనూ ఫౌజా సింగ్ తన బలం, నిబద్ధతతో తరతరాలకు ప్రేరణగా నిలిచారని అన్నారు. గత ఏడాది 'నాషా ముక్త్ - రంగాలా పంజాబ్' మద్యం వ్యతిరేక ర్యాలీలో ఫౌజా సింగ్‌తో కలిసి నడిచిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ విషయాన్ని గులాబ్ చంద్ కటారియా తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఫౌజా సింగ్ 1911 ఏప్రిల్ 1న పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించారు. భార్య, కొడుకు మరణాల కారణంగా మానసిక క్షోభకు లోనై 1992లో మారథాన్ పరుగుల వైపు మొగ్గుచూపారు. అప్పటి నుంచి మారథాన్ పరంగా సంచలన ప్రదర్శనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు.
వివరాలు
ప్రముఖ క్రీడా బ్రాండ్ ప్రకటనలో ఫౌజా సింగ్
ఫౌజా సింగ్ లండన్, టొరంటో, న్యూయార్క్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మారథాన్‌లలో పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఫౌజా, టొరంటో మారథాన్‌ను 5 గంటలు 44 నిమిషాలు 4 సెకన్లలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. అంతేకాకుండా, 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్, 2012లో లండన్ ఒలింపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా కూడా ఫౌజా సింగ్‌కు గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ లెజెండ్ డేవిడ్ బెక్‌హమ్, బాక్సింగ్ దిగ్గజం ముహమ్మద్ అలీతో కలిసి ఫౌజా సింగ్ ఓ ప్రముఖ క్రీడా బ్రాండ్ ప్రకటనలో కూడా పాల్గొన్నారు.