LOADING...
Arrest Kohli: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న'అరెస్ట్ కోహ్లీ'.. ఎందుకంటే..?
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న'అరెస్ట్ కోహ్లీ'.. ఎందుకంటే..?

Arrest Kohli: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న'అరెస్ట్ కోహ్లీ'.. ఎందుకంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న (బుధవారం) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ హృదయ విదారక ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. భారీ సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా స్టేడియం వద్దకు చేరడంతో, అదే సమయంలో వర్షం పడటం వల్ల పరిస్థితులు అదుపు తప్పి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సమాజంలోని వివిధ వర్గాలవారు ఈ ఘటనపై తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యత వహించాల్సిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆర్సీబీపై విమర్శలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి.

వివరాలు 

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'ArrestKohli' 

ఇప్పటికే ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ సంఘం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలపై పోలీసుల నిర్దిష్ట చర్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ విభాగం అధిపతి నిఖిల్ సోసాలే, డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని శుక్రవారం ఉదయం బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ప్రముఖ ఆటగాడు విరాట్ కోహ్లీ పేరూ చర్చల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో కోహ్లీ హాజరుకావడంతో అతడిని కూడా బాధ్యుడిగా గుర్తించి అరెస్ట్ చేయాలంటూ పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో 'ArrestKohli' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. పలువురు కోహ్లీపై వ్యంగ్యపూరిత పోస్టులు పెడుతూ, న్యాయ పరంగా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

వివరాలు 

అల్లు అర్జున్‌పై చర్యలు

ఇలాంటి సంఘటనలు ఇదే మొదటిసారి కావు.గత ఏడాది డిసెంబర్ 4న 'పుష్ప 2' సినిమా ప్రమోషన్ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన గుర్తుచేసుకుంటున్నారు నెటిజన్లు. అప్పట్లో నటుడు అల్లు అర్జున్ అకస్మాత్తుగా థియేటర్‌కు రావడం వల్ల ఏర్పడిన తొక్కిసలాటకు అతడినే కారణంగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే తీరుగా,విరాట్ కోహ్లీని చూడటానికి భారీగా జనం తరలివచ్చారనే కారణంతో అతడినే ఈ ప్రమాదానికి బాధ్యుడిగా అరెస్ట్ చేయాలంటూ నెటిజన్లు వాదిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకున్నట్టు,బెంగళూరు పోలీసులు కూడా కోహ్లీపై చర్యలు తీసుకునేనా అన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది.