WI vs IND: టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ సంచలన రికార్డు
భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో సంచలన రికార్డును సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. వెస్టిండీస్ 150 పరుగులకే ఆలౌట్ చేయడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచులో ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ బౌలర్ల నడ్డి విరిచాడు. దీంతో టెస్టు క్రికెట్లో 33 సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. టెస్టు క్రికెట్‌లో 30 మ్యాచులకు పైగా ఐదు వికెట్లు తీసిన ఇద్దరు భారతీయులు అశ్విన్ (33), అనిల్ కుంబ్లే (35) మాత్రమే ఉన్నారు. అగ్రస్థానంలో ముత్తయ్యమురళీధరన్ (67) నిలిచారు. షేన్‌వార్న్ (37), సర్‌రిచర్డ్ హ్యాడ్లీ (36), రంగనాహెరాత్ (34), జేమ్స్ ఆండర్సన్ (32) మాత్రమే తర్వాతి స్థానాల్లో నిలిచారు.
తండ్రీ కొడుకులను ఔట్ చేసిన బౌలర్ గా అశ్విన్ రికార్డు
ఈ మ్యాచులో రవిచంద్రన్ మరో రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మొదటి టెస్టులో అల్జారీ జోసెఫ్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ ఫీట్‌ను సాధించాడు. కుంబ్లే, హర్భజన్ సింగ్ తర్వాత ఆ రికార్డు సాధించిన మూడో భారతీయుడిగా అశ్విన్ నిలిచాడు. అదే విధంగా టెస్టు క్రికెట్లో తండ్రీ కొడుకులను ఔట్ చేసిన తొలి ఇండియన్ బౌలర్‌గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. 2011లో తన తొలి టెస్టులో శివ్‌నారాయణ్ చందర్‌పాల్ వికెట్ తీసిన అశ్విన్.. తాజాగా తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను ఔట్ చేసి ఈ అరుదైన ఘనతను సాధించాడు. క్రికెట్ చరిత్రలో టీమిండియా తరుపున ఇలాంటి ఫీట్ ను ఏ బౌలర్ అందుకోకపోవడం గమనార్హం.
విండీస్ 150 పరుగులకు ఆలౌట్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో టీమిండియానే స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైస్వాల్(40), రోహిత్ శర్మ(30) ఉన్నారు. ఆట ముగిసే సమయానికి భారత్ మరో 70 పరుగులు వెనుకబడి ఉంది.