Royal Challengers Bengaluru:17ఏళ్ల నీరక్షణకు తెరపడుతుందా.. 2025ఐపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీ గెలుస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
మరికొద్ది రోజులలో ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ ప్రారంభం కానుంది. గత 17 ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్‌ను అందుకోవడానికి ప్రయత్నించినా, అది ఇంకా కేవలం కలగానే మిగిలిపోయింది.
ఈ సారి అయినా విజయం సాధించాలని అభిమానులు తహతహలాడుతున్నారు.
2008లో ప్రారంభమైన తొలి ఐపీఎల్ సీజన్ నుంచి 2024 వరకు ఆర్సీబీ మూడుసార్లు ఫైనల్ చేరింది.
2009, 2011, 2016 సీజన్లలో విజయం అంచున నిలిచినా, బోల్తా పడి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
వివరాలు
కీలక సమయంలో చేతులెత్తేసే పరిస్థితి...
స్టార్ ఆటగాళ్లతో మెరిసే ఆర్సీబీ జట్టుకు విపరీతమైన అభిమాన మద్దతు ఉంది.తన శక్తి ఉన్న రోజున ఏదైనా బలమైన జట్టును సైతం తేలికగా ఓడించగలదు.
అయితే చాలా సీజన్లుగా లీగ్ దశలో మెరుగైన ప్రదర్శన కనబరిచినా,ముఖ్యమైన ప్లేఆఫ్స్‌లో మాత్రం తడబడుతూ వచ్చింది.
2024సీజన్‌లో మొదటి అర్థభాగంలో ఘోరంగా విఫలమైన ఆర్సీబీ, తొమ్మిది మ్యాచుల్లో ఏకంగా ఏడు పరాజయాలను చవిచూసింది.
కానీ, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అభిమానుల్లో మళ్లీ ఆశలు రేకెత్తించినా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలై,ఎప్పటిలానే నిరాశనే మిగిల్చింది.
ప్రతిసారీ "ఈ సాలా కప్ నమదే" అంటూ ఊరించుకుని చివరికి "ఏ సాల్ బీ కప్ నహీ" అనే పరిస్థితి వస్తోంది.
వివరాలు
కెప్టెన్‌గా కొత్త శకాన్ని ప్రారంభించే రజత్ పటిదార్
కానీ, ఈసారి మాత్రం ఈ చీకటి చరిత్ర పునరావృతం కాకూడదని ఆర్సీబీ అభిమానులే కాదు, ఆటగాళ్లు సైతం కృతనిశ్చయంతో ఉన్నారు.
అందుకే, ఆర్సీబీ యాజమాన్యం ఈసారి జట్టులో కీలక మార్పులు చేసింది. ఈసారి జరిగిన ఐపీఎల్ మెగా వేలానికి ముందు,ఆర్సీబీ విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యశ్ దయాళ్‌లను రిటైన్ చేసుకుంది.
విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాలని అభిమానులు ఆశించినా, యాజమాన్యం ఈసారి రజత్ పటిదార్‌కు లీడర్‌గా అవకాశం ఇచ్చింది.
విరాట్ కోహ్లీ సైతం ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచాడు. 2021లో కనీస ధర రూ.20 లక్షలకూ అమ్ముడుపోని రజత్ పటిదార్, ఇప్పుడు ఏకంగా రూ.11 కోట్లకు రిటైన్ అవ్వడం అతని ప్రదర్శనలో వచ్చిన మార్పును ప్రతిబింబిస్తోంది.
వివరాలు
జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన రజత్ పటిదార్
ఇప్పటివరకు అతను 27 ఐపీఎల్ మ్యాచులే ఆడాడు, కానీ అందులో ఒక సెంచరీ, ఏడు అర్థ సెంచరీలు ఉన్నాయి.
2021లో నాలుగు మ్యాచుల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసిన అతడిని ఆర్సీబీ వదులుకుంది. ఆ తర్వాత ఏ జట్టూ అతన్ని కొనుగోలు చేయలేదు.
కానీ, 2022లో ఆర్సీబీ అతడిని తిరిగి తీసుకుని ఆ అవకాశం అందించింది. అదే సీజన్‌లో లక్నోపై ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లో 112 పరుగులు చేసి ఆర్సీబీకి సునామీ విజయం అందించాడు.
అప్పటి నుంచి అతను జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగి, ఇప్పుడు ఏకంగా కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు.
ఈసారి అతనిపై మాత్రమే కాదు, మొత్తం ఆర్సీబీ జట్టుపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
వివరాలు
పోటీలో హోరాహోరీగా నిలిచే ఆర్సీబీ!
ఈసారి కూడా ఆర్సీబీ జట్టు అద్భుతమైన సమతూకంతో ఉంది.విరాట్ కోహ్లీ ఎప్పటిలానే పరుగుల వరద పారించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
రజత్ పటిదార్ తన సత్తా చాటేందుకు,దేవ్‌దత్ పడికల్ ధాటిగా ఆడేందుకు,ఫిల్ సాల్ట్ తన స్థిరమైన ఆటతీరును ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు.
మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉంది.లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా,స్వప్నిల్ సింగ్,టిమ్ డేవిడ్ వంటి ఆటగాళ్లతో ఆల్‌రౌండర్ల విభాగం మెరుగైంది.
బౌలింగ్‌లో యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్,లుంగి ఎంగిడి, నువాన్ తుషార్ వంటి పేస్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు.
స్పిన్ విభాగంలో సూయాష్ శర్మ,మోహిత్ రాథీలు కీలక పాత్ర పోషించనున్నారు.
ఈసారి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిజంగా చరిత్ర సృష్టిస్తుందా?ఆర్సీబీ అభిమానుల చిరకాల స్వప్నం నిజమవుతుందా? వేచి చూద్దాం!
వివరాలు
ఆర్సిబి జట్టు:
రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, దేవ్‌దత్ పడికల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, స్వస్తిక్ చికారా, జాకబ్ బేత్వెల్, లివింగ్ స్టోన్, కృనాల్ పాండ్య, మనోజ్ భాండగే, మోహిత్ రాథీ, రొమారియో షెపర్డ్, యశ్ దయాళ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, జోష్ హేజిల్‌వుడ్, అభినందన్ సింగ్, రసిక్ సలామ్, స్వప్నిల్ సింగ్, సూయాష్ శర్మ, నువాన్ తుషారా