
Womens ODI World cup 2025 : బెంగళూరుకు భారీ షాక్.. ఐసిసి మహిళల ప్రపంచ కప్ ముంబైకి మార్పు
ఈ వార్తాకథనం ఏంటి
సెప్టెంబర్ 30 నుండి మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, కొన్ని మ్యాచ్‌లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఆ మ్యాచ్‌లను బెంగళూరు నుంచి నవీ ముంబైకి తరలించినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. నవీముంబైలో మూడు లీగ్ మ్యాచ్‌లు, ఒక సెమీఫైనల్, ఫైనల్‌తో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఈ తరలింపుకు సంబంధించిన స్పష్టమైన కారణాలను ఐసీసీ ప్రకటించలేదు.
వివరాలు
మహిళల కప్‌లో మొత్తం 8 జట్లు
ఐసీసీ ఛైర్మన్ జైషా మాట్లాడుతూ, "ఊహించని పరిస్థితుల కారణంగా షెడ్యూల్ సర్దుబాటు చేయడం, వేదికను మార్చడం అవసరం అయ్యింది. అయినప్పటికీ, మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శనలకు అనువైన ఐదు ప్రపంచస్థాయి వేదికలను అందించగలగడం మాకు ఆనందంగా ఉంది. వేదిక సిద్ధమైపోయింది, ఈ టోర్నమెంట్ అభిమానులను అలరిస్తుందని ఆశిస్తున్నాం" అని తెలిపారు. మహిళల కప్‌లో మొత్తం 8 జట్లు పోటీపడతాయి. నవి ముంబైతో పాటు గౌహతి,ఇండోర్, విశాఖపట్నం, కొలంబో ఇతర వేదికలుగా ఉంటాయి. ఐసీసీ స్పష్టమైన కారణాలను వెల్లడించకపోయినప్పటికీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడానికి అవసరమైన అనుమతులు పొందలేకపోయినట్లుగా తెలుస్తోంది.
వివరాలు
ఆర్‌సీబీ చిన్నస్వామి వేదికగా విజయోత్సవ వేడుకలు
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజయం సాధించింది. ఆ ఫైనల్ అనంతరం, చిన్నస్వామి స్టేడియంలో జట్టు విజయోత్సవాలను నిర్వహించారు. అయితే, ఆ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురు అభిమానులు మరణించారు. ఈ ఘటనపై విచారణ చేసిన తర్వాత, చిన్నస్వామి స్టేడియంలో పెద్ద ఈవెంట్లు నిర్వహించకూడదని పేర్కొన్న సంగతి తెలిసిందే.