Page Loader
WTC 2023-25: డ‌బ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ అడనప్పటికీ.. ఇండియాకు ద‌క్కే ప్రైజ్‌మ‌నీ ఎంతంటే?
డ‌బ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ అడనప్పటికీ.. ఇండియాకు ద‌క్కే ప్రైజ్‌మ‌నీ ఎంతంటే?

WTC 2023-25: డ‌బ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ అడనప్పటికీ.. ఇండియాకు ద‌క్కే ప్రైజ్‌మ‌నీ ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్‌ ఈరోజు ప్రారంభం కానుంది. ప్రెస్టీజియస్ టైటిల్ కోసం దక్షిణాఫ్రికా జట్టు , ఆస్ట్రేలియా జట్లు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో తలపడనున్నాయి. ఫైనల్‌కు ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో విజేతలకు, రన్నరప్‌కి ఇవ్వబోయే ప్రైజ్‌మనీ వివరాలను వెల్లడించింది. అలాగే మూడో స్థానంలో నిలిచిన భారత జట్టుకు లభించనున్న పారితోషికం కూడా ప్రకటించారు.

వివరాలు 

భారత్‌కి భారీ ప్రైజ్‌మనీ 

ఈసారి ఇండియా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత పొందకపోయినా, టోర్నీ మొత్తంలో మూడో స్థానంలో నిలిచింది. అందుకే టీమిండియాకు కూడా ప్రైజ్‌మనీగా రూ.12.33 కోట్లు (సుమారు 1.48 మిలియన్ డాలర్లు) ఇవ్వనున్నారు. ఇక ఫైనల్‌లో గెలిచే జట్టుకు 3.6 మిలియన్ల డాలర్లు (అందునా దాదాపు రూ.30 కోట్లు) లభించనున్నాయి. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 2.1 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.17.5 కోట్లు) అందజేస్తారు.

వివరాలు 

ఇప్పటివరకు WTC ప్రదర్శన ఎలా ఉందంటే? 

ఈ డబ్ల్యూటీసీ సైకిల్ రెండేళ్ల పాటు 9 జట్ల మధ్య జరిగింది. ఇందులో దక్షిణాఫ్రికా 69.44 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 19 టెస్టులు ఆడిన దక్షిణాఫ్రికా, వాటిలో 13 విజయాలు నమోదు చేసింది. ఇక ఆస్ట్రేలియా 67.54 శాతం పాయింట్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడుతూ, విజేతగా అవతరించేందుకు తుది పోరుకు సిద్ధమవుతున్నాయి.

వివరాలు 

ఒకరు టైటిల్ నిలబెట్టుకోవాలనుకుంటే, మరొకరు చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు 

ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే 2023లో జరిగిన టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాను ఓడించి టైటిల్‌ను అందుకుంది. అందువల్ల ఈసారి ఆ టైటిల్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. మరోవైపు టెంబా బవుమా సారథ్యంలో దక్షిణాఫ్రికా తొలిసారి టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలవాలనే దృష్టితో ప్రయత్నిస్తోంది. ఈ విజయంతో సుదీర్ఘ చరిత్రలో తమ కీర్తిపతాకాన్ని మరింత ఎత్తులో ఎగురవేసేందుకు ప్రయత్నిస్తోంది.