
South Africa: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నేపథ్యంలో.. ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు సౌతాఫ్రికా ఆటగాళ్లు దూరం
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు జూన్ 11న లార్డ్స్ వేదికగా జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (ICC World Test Championship) ఫైనల్‌లో తలపడనున్నాయి.
అయితే, ఈ పోటీలో సౌతాఫ్రికా తరఫున పాల్గొనబోయే ఆటగాళ్లు ఐపీఎల్ (IPL) ప్లేఆఫ్స్‌కు దూరం కానున్నారు.
ఇటీవల, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది.
ఈ ఘటన తరువాత, భారత్,పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో, ఐపీఎల్ టోర్నీ అర్ధంతరంగా వాయిదా పడింది. తర్వాత, భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో, ఐపీఎల్ తిరిగి మే 17న ప్రారంభమై, ఫైనల్ జూన్ 3న జరుగుతుందని బీసీసీఐ (BCCI) ప్రకటించింది.
వివరాలు
మా ప్రధాన ప్రాధాన్యత డబ్ల్యూటీసీ ఫైనల్: సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు
ఈ తాజా ఐపీఎల్ షెడ్యూల్ కారణంగా, డబ్ల్యూటీసీ సన్నాహకాల్లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.
అందువల్ల, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు, తమ ఆటగాళ్లను ముందుగా నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం మే 26న స్వదేశానికి పంపాలని బీసీసీఐని కోరింది.
వారు తమ ప్రధాన ప్రాధాన్యత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో పాల్గొనడమే అని ప్రకటించారు.
"మా ప్రథమ ప్రాధాన్యత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడడం. అందుకే టెస్ట్ జట్టులో భాగమయ్యే మా ఆటగాళ్లు మే 26న తిరిగి రావాలని మేం ఆశిస్తున్నాం. ఈ అభ్యర్థనను బీసీసీఐకి కూడా తెలియజేసాం" అని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఎనోచ్ న్క్వే విలేకరుల సమావేశంలో చెప్పారు.
వివరాలు
క్రికెట్ బోర్డు వైఖరిని సమర్ధించిన దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్
దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ షుక్రి కాన్రాడ్ కూడా క్రికెట్ బోర్డు వైఖరిని సమర్థించారు.
"ఐపీఎల్, బీసీసీఐతో చేసిన ఒప్పందం ప్రకారం మా ఆటగాళ్లు మే 26న తిరిగి రావాలి. మేము డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం మే 30న బయలుదేరాల్సి ఉంటుంది. అప్పుడే మాకు తగినంత సమయం దొరుకుతుంది. ప్రస్తుతానికి, మేము ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గడం లేదు" అని అతడు చెప్పారు.
వివరాలు
ఐపీఎల్ ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వీరే..
ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో పాల్గొబోయే వారు..కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్), లుంగి ఎంగిడి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ట్రిస్టన్ స్టబ్స్ (దిల్లీ క్యాపిటల్స్), ఐడెన్ మార్‌క్రమ్ (లక్నో సూపర్ జెయింట్స్), ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్), మార్కో యాన్సెన్ (పంజాబ్ కింగ్స్), వియాన్ ముల్డర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్). ఈ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు పోటీపడుతున్నాయి.