
Pakistan-Baluchistan-Terrorist attack: రెచ్చిపోయిన ఉగ్రవాదులు...11మంది హత్య
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్(Pakistan) లో ని బలూచిస్థాన్ (Baluchistan) లో ఉగ్రవాదులు (Terrorists) రెచ్చిపోయారు.
నోష్కి (Noshki) జిల్లాలోని జాతీయ రహదారిపై దారికాచి మరీ ముష్కరులు పేట్రేగిపోయారు.
ఉగ్రవాదులు ఓ బస్సును అడ్డుకుని అందులో తొమ్మిది మందిని అపహరించారు.
అనంతరం వారందరినీ విచక్షణారహితంగా కాల్చివేశారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని నోష్కి జిల్లా లో క్వెట్టా నుంచి తఫ్తాన్ కు కొంతమంది ప్రయాణికులతో బస్సు బయల్దేరింది.
క్వెట్టా దాటిన తర్వాత కొద్ది దూరంలో ఓ జాతీయరహదారిపై అప్పటికే మాటువేసిన ఉగ్రవాదులు బస్సును అడ్డుకున్నారు.
బస్సులోంచి 9మంది ప్రయాణికుల్ని కిందికి దించిన ఉగ్రవాదులు వారిని తమతోపాటు పర్వత ప్రాంతానికి తీసుకెళ్లిపోయారు.
దీంతో మిగతా ప్రయాణికులు భయపడిపోయి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
Terrorists attack
వంతెన సమీపంలో మృతదేహాలు
పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఓ వంతెన సమీపంలో ఆ తొమ్మిదిమంది మృతదేహాలు కనిపించాయి.
ఇదే జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్న కారుపై ముష్కరమూకలు దాడి చేసి కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ రెండు ఘటనలకు బాధ్యులుగా ఏ ఒక్క ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు.
ఈ రెండు ఘటనలపై బలూచి స్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ బుక్తి స్పందిస్తూ ఇలాంటి చర్యలు పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
ఈ ఘటనకు బాధ్యులైనవారిని ఎవరినీ వదిలిపెట్టబోమని తెలిపారు.
కాగా,మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సీన్ నఖ్వీ హామీనిచ్చారు.