LOADING...
Microsoft : రెడ్ పెయింట్,విధ్వంసం.. మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో 18 మంది ఉద్యోగుల అరెస్టు
రెడ్ పెయింట్,విధ్వంసం.. మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో 18 మంది ఉద్యోగుల అరెస్టు

Microsoft : రెడ్ పెయింట్,విధ్వంసం.. మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో 18 మంది ఉద్యోగుల అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

గాజా ప్రాంతంలో హమాస్‌ ను అంతమొందించాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్‌ సైన్యం తీవ్ర వైమానిక దాడులు చేస్తూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ హింసాకాండ అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇజ్రాయెల్‌ చర్యలపై ఆగ్రహించిన సంస్థ ప్రధాన కార్యాలయంలోని కొందరు ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి చేసిన సాంకేతికతను ఇజ్రాయెల్‌ సైన్యం దారుణాలకు వినియోగిస్తోందని వారు ఆరోపిస్తూ, ఇజ్రాయెల్‌తో ఉన్న టెక్నాలజీ సంబంధాలను తక్షణమే ముగించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సంస్థ మేనేజ్‌మెంట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 18 మంది ఉద్యోగులను అరెస్ట్‌ చేశారు.

వివరాలు 

Microsoft సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నందుకు వ్యతిరేకంగానే ఈ నిరసనలు

ఇజ్రాయెల్‌ సైన్యం గాజా కార్యకలాపాల్లో నిఘా కోసం Microsoft సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నందుకు వ్యతిరేకంగానే ఈ నిరసనలు జరిగినట్టు సమాచారం. వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌ తూర్పు క్యాంపస్‌ను ఉద్యోగులు చుట్టుముట్టి ఆందోళన నిర్వహించగా, అక్కడికి చేరుకున్న పోలీసులు ఆగస్టు 20న మధ్యాహ్నం 12:15 గంటలకు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ప్రస్తుత, మాజీ మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు ఉన్నట్టు ధృవీకరించారు.

వివరాలు 

నిరసనలకు కారణం 

కాగా, ఉద్యోగుల నిరసనలకు ప్రధాన కారణం బ్రిటన్‌కు చెందిన 'ది గార్డియన్‌' పత్రికలో వచ్చిన ఓ కథనమే. అందులో,ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (IDF) మైక్రోసాఫ్ట్‌ Azure క్లౌడ్‌ సర్వీసులు వినియోగించి గాజా,వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని పాలస్తీనీయుల ఫోన్ కాల్స్‌ను పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ సమాచార ప్రకారం,మైక్రోసాఫ్ట్‌-ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మధ్య బలమైన అనుబంధం ఉందని వెల్లడైంది. 2023 అక్టోబర్‌లో హమాస్‌ దాడుల తరువాత ఇజ్రాయెల్‌ సైన్యంలో ఏఐ వినియోగం 200 రెట్లు పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. నిఘా,భాషా అనువాదం,డేటా విశ్లేషణ వంటి పనులన్నింటికీ Azure ప్లాట్‌ఫారమ్ వాడుతున్నారని, చివరికి ఆ సమాచారాన్ని AI ఆధారిత టార్గెట్‌ సిస్టమ్‌కు చేరుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

వివరాలు 

మైక్రోసాఫ్ట్‌ సమీక్షలో చర్యలు 

అయితే, మైక్రోసాఫ్ట్‌ అంతర్గత సమీక్షలో Azure లేదా AI వేదికలను ప్రజలకు హాని చేసే విధంగా ఉపయోగించిన ఆధారాలు ఏవీ లభించలేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల నిరసనలతో అప్రమత్తమైన మైక్రోసాఫ్ట్‌ ఈ ఆరోపణలపై విచారణ ప్రారంభించింది. Covington&Burlingఅనే న్యాయ సంస్థ ద్వారా దర్యాప్తు చేపట్టినట్టు ప్రకటించింది. తమ సర్వీస్‌ పాలసీలు ఇలాంటి వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవని కంపెనీ స్పష్టంచేసింది. ఇది అత్యంత సున్నితమైన విషయం కాబట్టి పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే,ఉద్యోగులు మాత్రం కంపెనీ సమాధానాలతో అసంతృప్తిగా ఉన్నారు. కేవలం దర్యాప్తు సరిపోదని,మైక్రోసాఫ్ట్‌ ఇజ్రాయెల్‌కు అందిస్తున్న టెక్నాలజీ మద్దతును తక్షణమే నిలిపివేయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఈ నిరసనలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.