
USA: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఇద్దరి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది.
ఫ్లోరిడా రాష్ట్రంలోని తలహసీ పట్టణంలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో గురువారం జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు.
ఈ దాడి అనంతరం పోలీసులు కాల్పులకు పాల్పడిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.
గాయపడిన వారిలో కొందరికి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తలహసీ మెమోరియల్ హెల్త్‌కేర్ ప్రతినిధి వెల్లడించారు.
ఈ అనుకోని ఘటన నేపథ్యంలో పోలీసులు వెంటనే స్పందించి యూనివర్సిటీ పరిసరాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు.
మొదట స్టూడెంట్ యూనియన్‌లో ఓ యాక్టివ్ షూటర్ ఉన్నట్లు సమాచారం రావడంతో యూనివర్సిటీ యాజమాన్యం అప్రమత్తమైంది.
వివరాలు
లాక్‌డౌన్‌లోకి క్యాంపస్
వెంటనే అలర్ట్ జారీ చేస్తూ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరూ యూనివర్సిటీని తక్షణమే ఖాళీ చేయాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది.
ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు, ఇతర అత్యవసర సేవా విభాగాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.
ఈ ఘటనతో క్యాంపస్ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. గురువారం జరగాల్సిన తరగతులు, క్రీడా కార్యక్రమాలు, ఇతర ఈవెంట్లన్నీ రద్దు చేశారు.
ఈ విషయమై అధికారుల నుంచి సమాచారం అందుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఇది అత్యంత దురదృష్టకరమైన, భయానకమైన సంఘటన అని ఆయన వ్యాఖ్యానించారు.