US: టెక్సాస్ హైవేపై 3 కార్లను ఢీకొన్న విమానం.. నలుగురికి గాయలు
అమెరికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని విక్టోరియా హైవేపై ఒక చిన్న విమానం కూలిపోయింది. ఇది పలు కార్లను ఢీకొట్టి ముక్కలుగా విడిపోయింది. ఘటనాస్థలికి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. రోడ్లను తాత్కాలికంగా మూసివేసి ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించారు. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడగా, విమానంలో ఉన్నవారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అలాగే, మూడు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా ఈస్ట్ హై స్కూల్ వద్ద పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు కొంత ఇబ్బందికి గురయ్యారు.
దర్యాప్తు ప్రారంభించిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్
అధికారుల ప్రకారం, ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా విమానం హైవేపై కూలిపోయింది. విమాన శిథిలాలు చెల్లాచెదురుగా ఉండగా, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. ఆస్పత్రికి తరలించిన వారిలో పైలట్ ఉన్నారా లేక ఇతరులు మాత్రమేనా అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. ప్రమాద సమయంలో భారీ శబ్ధం విన్నామని స్థానికులు తెలిపారు.