
Baby Bonus: కొత్త తల్లులకు $5,000 'బేబీ బోనస్'.. ఎక్కువ మంది పిల్లలను కనడంపై అమెరికా దృష్టి!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో జననాల రేటు (Fertility Rate) క్రమంగా తగ్గుతుండటంపై అక్కడి ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది.
ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు, పౌరులను ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించేలా డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పలు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
ఈ చర్యల భాగంగా, బిడ్డకు జన్మనిచ్చిన మహిళలకు 5వేల డాలర్ల 'బేబీ బోనస్' (Baby Bonus) ఇవ్వాలన్న అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నట్లు అమెరికన్ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
అతితక్కువగా మారుతున్న జననాల రేటును మెరుగుపరచేందుకు అవసరమైన వ్యూహాలపై వైట్‌హౌస్‌లో ఇటీవల కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో సంతానోత్పత్తిపై మహిళల్లో అవగాహన పెంపుదల,పిల్లలను కనే కుటుంబాలకు ఆర్థిక ప్రోత్సాహాలు కల్పించడంపై చర్చ జరిగింది.
వివరాలు
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో 30 శాతం స్కాలర్‌షిప్
ఈ క్రమంలో బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి అమెరికన్ మహిళకు రూ.5 వేల డాలర్ల విలువైన బేబీ బోనస్, పన్ను మినహాయింపులు వంటి పలు ఆర్థిక ప్రయోజనాల ప్రతిపాదనలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.
అంతేకాక,వివాహితులు లేదా పిల్లలున్న వారికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో స్కాలర్‌షిప్‌లలో 30 శాతం సీట్లు కేటాయించాలన్న ఐడియా కూడా చర్చకు వచ్చింది.
అయితే ఈ అంశంపై కొంత విభేదం నెలకొన్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ భేటీలో జనాభా పెంపు వ్యూహాలపై తుది నిర్ణయాలు తీసుకోకపోయినా, ఈ అంశంపై అనేక మంది ఆసక్తి కనబరిచారని సమాచారం.
వివరాలు
క్షీణిస్తోన్న జననాల రేటు..
గతంలో పలు సందర్భాల్లో జననాల రేటు క్షీణతపై తన ఆందోళనను వ్యక్తపరచిన జేడీ వాన్స్ ఈ సమస్య నాగరికత సంక్షోభాన్ని తెచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మరోవైపు, ఎలాన్ మస్క్ కూడా ఎక్కువ మంది సంతానానికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
అమెరికాలో 1990ల నుంచే జననాల రేటు క్రమంగా తగ్గుతున్నదిగా ట్రెండ్ కొనసాగుతోంది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC)నివేదిక ప్రకారం,2023లో అమెరికాలో ఫెర్టిలిటీ రేటు 1.62గా నమోదైంది,ఇది రీప్లేస్‌మెంట్ లెవెల్‌గా పరిగణించే 2.1కు చాలా తక్కువ.
జీవన ఖర్చులు పెరగడం, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యోగ రంగంలో పాల్గొనడం, అలాగే సమాజంలో సాంస్కృతిక మార్పులు వంటి అంశాలు ఈ తగ్గుదలకి ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.