Page Loader
Israel Attacks: గాజాలో అన్నార్తులపై ఆగని దాడులు.. తాజా కాల్పుల్లో 93 మంది మృత్యువాత 
గాజాలో అన్నార్తులపై ఆగని దాడులు.. తాజా కాల్పుల్లో 93 మంది మృత్యువాత

Israel Attacks: గాజాలో అన్నార్తులపై ఆగని దాడులు.. తాజా కాల్పుల్లో 93 మంది మృత్యువాత 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

గాజాలో ఇటీవలికాలంలో మారణహోమం ఆగకుండా కొనసాగుతోంది. పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నది. గడచిన 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో సుమారు 93 మంది సాధారణ పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జరిగిన ఈ దాడుల్లో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరపడంతో వారు మృతి చెందారని సమాచారం. యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా భూభాగంలో జికిమ్ క్రాసింగ్‌ ద్వారా ఉత్తర గాజాలోకి వస్తున్న వాహనాలను చూసిన స్థానికులు ఆహారం కోసం పరుగులు తీస్తుండగా, వారిపై ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపినట్టు జాగా పౌర రక్షణ సంస్థ వెల్లడించింది.

వివరాలు 

దక్షిణ గాజాలో జరిగిన మరో దాడిలో ఆరుగురు పాలస్తీనా పౌరులు మృతి

ఈ దాడిలో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారని,వంద మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. గాయపడిన వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక దక్షిణ గాజాలో జరిగిన మరో దాడిలో ఆరుగురు పాలస్తీనా పౌరులు మృతిచెందారు. దక్షిణాన ఉన్న రఫా సమీపంలోని సహాయ కేంద్రంలో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని ఏజెన్సీ ప్రతినిధి మహమూద్ బసల్ ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధమైన ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రకారం.. ఆహార సహాయాన్ని తీసుకొస్తున్న 25 ట్రక్కుల కాన్వాయ్ గాజా నగరానికి సమీపంగా రాగానే, ఆహారం కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనా పౌరులు ఒక్కసారిగా వాహనాల వైపు పరుగులు తీశారు.

వివరాలు 

 ఆహారం కోసం ప్రయత్నిస్తూ సుమారు 800 మంది మృతి 

దీంతో, ఇజ్రాయెల్ సైన్యం వారిపై కాల్పులకు పాల్పడింది. ఈ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం తమకు ముప్పుగా భావించిన వారిపై హెచ్చరిక కాల్పులు జరిపామని పేర్కొంది. మే నెల నుంచి జూలై వరకూ ఇలా ఆహారం కోసం ప్రయత్నిస్తూ సుమారు 800 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి ఈ నెల ప్రారంభంలో తెలిపిన విషయం గమనార్హం. ఇక సెంట్రల్ గాజాలో ఉన్న ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ మిలటరీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు యుద్ధాన్ని ఆపి, ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఖతార్‌లో కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్న సమయంలో, ఇజ్రాయెల్ సైన్యం ఈ తరహా హెచ్చరికలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.