Page Loader
Pakistan: బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. ప్రయాణికుల్ని కాల్చి చంపిన దుండగులు
బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. ప్రయాణికుల్ని కాల్చి చంపిన దుండగులు

Pakistan: బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. ప్రయాణికుల్ని కాల్చి చంపిన దుండగులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మానవత్వాన్ని మింగేసేలా ఘోర ఘటన చోటుచేసుకుంది. బస్సును అడ్డగించిన సాయుధ దుండగులు తొమ్మిది మంది ప్రయాణికుల్ని బయటకు లాగి, కిడ్నాప్ చేసి అనంతరం కాల్చిచంపారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకోగా, శుక్రవారం అధికారికంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారి నవీద్ ఆలం తెలిపిన వివరాల ప్రకారం, మృతులంతా బుల్లెట్ గాయాలతో ఉన్నారు. వారి మృతదేహాలు రాత్రి సమయంలో పర్వత ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన దుండగులు ఎవరు? ఏ ఉగ్రవాద సంస్థదీ ఈ పని? అనే అంశాలపై ఇంకా స్పష్టత లేదు.

Details

పంజాబ్‌ వాసులే లక్ష్యం

బస్సులో ప్రయాణిస్తున్న పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన వారిని ముందు దించేసిన దుండగులు, మిగిలిన వారిని ఎన్-40 హైవేపై కలేటా నుంచి లాహోర్‌ వెళ్తుండగా ఆపి కిడ్నాప్ చేశారు. గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన ముష్కరులు, తొమ్మిది మందిని ప్రత్యేకంగా గుర్తించి తీసుకెళ్లారు. ఆ తర్వాత కేవలం గంటన్నర వ్యవధిలోనే కొండల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి.

Details

దుండగుల కోసం గాలింపు

ఇదే దారుణానికి పాల్పడినవారు 10 నుంచి 12 మంది ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన తర్వాత వారు పరారయ్యారు. ప్రస్తుతం వారి కోసం పాకిస్థాన్ భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అధికార ప్రతినిధుల స్పందన ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ దారుణానికి పాల్పడినవారిని పట్టుకుని కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు.