రాహుల్ గాంధీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్టు కేసును తాము నిశితంగా పరిశీలిస్తోందని, అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు.
భావప్రకటనా స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కుల పరిరక్షణ అంశాల్లో అమెరికా, భారత్ కలిసి పనిచేస్తున్నట్లు పటేల్ చెప్పారు.
న్యాయ పాలన, న్యాయ స్వాతంత్ర్యం పట్ల గౌరవం ఉండటమనేది ఏ ప్రజాస్వామ్యానికైనా మూలస్తంభమని వేదాంత్ పటేల్ వివరించారు.
భారత్, అమెరికా తమ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసుకోవడంలో ప్రజాస్వామ్య సూత్రాల ప్రాముఖ్యత, భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణ అనేది చాలా కీలకమన్నారు.
రాహుల్ గాంధీ
ఎంపీ బంగ్లా ఖాళీ చేయాలని రాహుల్‌కు నోటీసులు
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు మార్చి 23న రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హుడైనట్లు లోక్‌సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించారు. బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించాయి. అంతేకాదు ఆరోజును "ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే"గా విపక్షాలు అభివర్ణించాయి.
ఇదిలా ఉంటే, మంగళవారం రాహుల్ గాంధీకి ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.