Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పాలన నుండి తప్పించుకోవడానికి.. ఓ క్రూయిజ్ కంపెనీ టూర్ ప్యాకేజీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విల్లా వై రెసిడెన్స్ అనే క్రూయిజ్ కంపెనీ వినూత్నమైన టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఇందులో నాలుగేళ్లపాటు సముద్రంలోనే గడపడం లాంటి ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. "ఫలానా వారు గెలిస్తే దేశం విడిచి వెళ్లిపోతాం" అని భావించిన వారి కోసం ఈ ప్యాకేజీని రూపొందించామని కంపెనీ సీఈఓ తెలిపారు.
నాలుగేళ్ల పాటు క్రూయిజ్ షిప్‌లో ప్రపంచాన్ని చుట్టచ్చు
అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపును ప్రస్తావించకుండా, ప్రస్తుత పాలనకు విరుద్ధంగా ఉండాలనుకునేవారికి ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని అందిస్తున్నామని విల్లా వై రెసిడెన్స్ ప్రకటన చేసింది. నాలుగేళ్ల పాటు క్రూయిజ్ షిప్‌లో ప్రపంచాన్ని చుట్టేయొచ్చని పేర్కొంది. ఈ ప్యాకేజీ పేరు 'స్కిప్ ఫార్వర్డ్' గా ఉంచింది. డబుల్ ఆక్యుపెన్సీ గదులకు 1,59,999 డాలర్లు (అంటే సుమారు రూ.1.35 కోట్లు), సింగిల్ ఆక్యుపెన్సీ క్యాబిన్లకు 2,55,999 డాలర్లు (సుమారు రూ.2.16 కోట్లు) ధరగా పేర్కొంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలకు దూరంగా ఉండాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమమైన అనుభవంగా ఉంటుందని ఆ ప్రకటన పేర్కొంది.
కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం
"ఎన్నికల ఫలితాలకు ముందే ఫలానా వారు గెలిస్తే దేశం విడిచి వెళ్లిపోతామన్న వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాకేజీని రూపొందించాం. మాకు భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ప్రపంచాన్ని వాస్తవంగా అన్వేషించడంలోనే మాకు నమ్మకం ఉంది" అని విల్లా వై సీఈఓ మైకేల్ పీటర్సన్ అన్నారు. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు పొందగా, కమలా హారిస్ 226 వద్ద నిలిచారు. 2025 జనవరిలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.