LOADING...
Pakistan: పాకిస్థాన్‌లో తప్పిన ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు! 
పాకిస్థాన్‌లో తప్పిన ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు!

Pakistan: పాకిస్థాన్‌లో తప్పిన ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో మరో రైలు ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి లాహోర్ సమీపంలో ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండగా, వెంటనే వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే అధికారుల ప్రకారం, ఈ రైలు లాహోర్ నుంచి రావల్పిండికి వెళ్తుండగా, లాహోర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేక్‌పురా జిల్లాలోని కాలా షా కాకు ప్రాంతంలో ప్రమాదం జరిగింది. రైలులోని పది బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై బోగీల నుంచి బయటకు పరుగులు తీశారు.

Details

రైలు బయలుదేరిన 30 నిమిషాల్లోనే ప్రమాదం

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని రక్షించాయి. రైలు లాహోర్‌ నుంచి బయలుదేరిన 30 నిమిషాల్లోనే ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం గాయపడిన వారిలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి మృతి సంభవించలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన పాకిస్తాన్ రైల్వే మంత్రి ముహమ్మద్ హనీఫ్ అబ్బాసీ, రైల్వే సీఈవో, డివిజనల్ సూపరింటెండెంట్‌లను వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు.

Details

రైలు భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు

అలాగే ఈ ప్రమాదంపై ఏడురోజుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. గత 15 రోజుల్లో ఇది మూడవ రైలు ప్రమాదం కావడం గమనార్హం. జూలై 28న క్వెట్టాకు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పేలుడు సంభవించి మూడు బోగీలు పట్టాలు తప్పాయి. జూలై 17న సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ వద్ద వరుస పేలుళ్లకు గురైన జాఫర్ ఎక్స్‌ప్రెస్ మరోసారి పట్టాలు తప్పింది. రైలు భద్రతపై పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.