
Mount Rushmore: వాషింగ్టన్, లింకన్‌ల సరసన ట్రంప్ శిల్పం?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు తనకు తానే ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఈ క్రమంలో ఆయన నోబెల్ శాంతి బహుమతి వెంటపడుతున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు అమెరికాలో ప్రముఖ నాయకుల ముఖాలను చెక్కిన 'మౌంట్ రష్మోర్' (Mount Rushmore)పై ఆయన కన్ను ఎప్పటి నుంచో ఉంది. ఆ కొండపై నేషనల్ మెమోరియల్‌లో తన ముఖ శిల్పాన్ని చెక్కించాలని ఆయన ఉబలాపడుతున్నారు. తాజాగా ఆయన ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన ఏఐ వీడియో ఒక దానిని షేర్ చేశారు. అందులో ప్రముఖ అధ్యక్షుల ముఖాల పక్కనే తనది ఉన్నట్లు చూపించారు.
Details
ఒక్కో శిల్పం 60 అడుగుల ఎత్తు
మౌంట్ రష్మోర్ (Mount Rushmore) నేషనల్ మెమోరిల్ దక్షిణ డకోటాలోని కీస్టోన్ వద్ద ఉన్న బ్లాక్ హిల్‌పై ఉంది. ఇక్కడి భారీ గ్రానైట్ శిలలపై శిల్పి గుట్జోన్ బొర్గలుమ్ అధ్యక్షుల ముఖాల బొమ్మలను డిజైన్ చేశారు. ఏటా కొన్ని మిలియన్ల మంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ మెమోరియల్‌పై అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, రూస్‌వెల్ట్, అబ్రహం లింకన్ ముఖాలు ఉన్నాయి. వీరంతా అమెరికాను వివిధ అంశాల్లో బలోపేతం చేసిన నాయకులు. ఒక్కో శిల్పం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. వీటిల్లో తన ముఖం కూడా ఉండాలని ట్రంప్ కోరుకున్నారు.
Details
ఐదో ముఖంపై చెక్కడానికి చోటు సరిపోదు
ఆయన రెండో సారి అధ్యక్ష పదవి చేపట్టగానే ఫిబ్రవరిలో కాంగ్రెస్ ఉమెన్ అన్నా పౌలినా లూనా ట్రంప్ శిల్పం ఏర్పాటు చేయాలంటూ బిల్లును తీసుకొచ్చారు. గతంలో జాన్ ఎఫ్ కెన్నడీ, రోనాల్డ్ రీగన్, బరాక్ ఒబామా తదితరులు అక్కడ తమ బొమ్మ కూడా ఉండాలని కోరుకున్నారు. కానీ, ఇవేవీ ఆచరణలోకి రాలేదు. తాజాగా ట్రంప్ విషయంలో అమెరికా (USA) అధికారులు పెదవివిరుస్తున్నారు. అది ఆచరణ సాధ్యంకాదని చెబుతున్నారు. ఆ పర్వతంపై ఐదో ముఖం చెక్కడానికి చోటు సరిపోదని పేర్కొన్నారు. ఇక మౌంట్ రష్మోర్‌ను నిర్వహించే నేషనల్ పార్క్ సర్వీస్ కూడా అక్కడ ఐదో తల ఏర్పాటుకు సురక్షిత ప్రదేశం లేదని వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.