Page Loader
రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమెరికా
రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన అమెరికా

రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమెరికా

వ్రాసిన వారు Stalin
Feb 09, 2023
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా నుంచి ముడి చమురును భారత్ కొనుగోలు చేయడం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్‌పై ఆంక్షలు విధించే ఉద్దేశం తమకు లేదని అమెరికాకు చెందిన ఐరోపా, యురేషియా వ్యవహారాల సహాయ కార్యదర్శి కరెన్ డాన్‌ఫ్రైడ్ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి అనేక దేశాలు ముడిచమురును దిగుమతి చేసుకోవడాన్ని నిలిపేశాయి. అయితే భారత్ మాత్రం ఆసక్తికరంగా దిగుమతిని తగ్గించకుండా ఇంకా గణనీయంగా పెంచింది. దీనిపై గతంలో పాశ్చాత్య దేశాలు పెదవి విరిచాయి. ఈ క్రమంలో భారత్ కూడా అదేస్థాయిలో ఆ దేశాలకు సమాధానం చెప్పింది. తాజాగా ఈ అంశంపై స్పందించిన డాన్‌ఫ్రైడ్.. రష్యా నుంచి ముడిచమురును దిగుమతి చేసుకోవడం భారత్ ఇష్టమన్నారు.

అమెరికా

రష్యా నమ్మదగిన ఇంధన సరఫరాదారు కాదు: అమెరికా

భారత్ తన విదేశాంగ విధానాన్ని అనుసరించే ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని డాన్‌ఫ్రైడ్ పేర్కొన్నారు. భారత విదేశాంగ విధానాన్ని అమెరికా గౌరవిస్తుందని చెప్పారు. ఈ దశాబ్దం చివరి నాటికి రష్యా నిల్వలు 50శాతానికి తగ్గుతాయని ఈ సందర్భంగా వెల్లడించారు. భారత్, అమెరికా సంయుక్తంగా ఇంధన భద్రత ఎజెండాను కొనసాగిస్తున్నాయని ఇంధన వనరుల అమెరికా సహాయ కార్యదర్శి జాఫ్రీ ప్యాట్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నట్లు చెప్పారు. అలాగే రష్యా నమ్మదగిన ఇంధన సరఫరాదారు కాదన్నారు. ప్రపంచ మార్కెట్‌లో రష్యా ఏకాకి అయినందు వల్ల, తక్కువ ధరకు ముడి చమురును భారత్ సమర్థవంతంగా దిగుమతి చేసుకుంటోందని ప్యాట్ స్పష్టం చేశారు.