
US-China Race: చైనాపై అమెరికా ఆధారపడటం ఆందోళనకరం.. జేపీ మోర్గాన్ సీఈఓ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-చైనాల మధ్య చిప్స్ పోటీ(US-China Race)ఉధృతమవుతున్న వేళ, ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ జేపీ మోర్గాన్ ఛేజ్ సీఈఓ జేమీ డిమోన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అవసరమైన పెన్సిలిన్‌లో 100శాతం చైనా నుంచే దిగుమతి అవుతోందని, ఇది ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. అంతేకాకుండా రేర్‌ఎర్త్ మెటీరియల్స్, అత్యాధునిక చిప్స్ తయారీ పరికరాలు కూడా బీజింగ్ నుంచే వస్తున్నాయని చెప్పారు. అత్యంత శక్తివంతమైన ఏఐ సిస్టమ్స్ తయారీలో ఉపయోగించే చిప్ తయారీ టూల్స్ కూడా చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. చైనా సూపర్‌సోనిక్ మిసైళ్లను మరింత శక్తివంతం చేసే పరికరాలను ఎగుమతి చేయరాదని డిమోన్ సూచించారు. అయితే వారి పురోగతి వేగాన్ని తగ్గించడం సాధ్యమే కానీ, పూర్తిగా ఆపడం మాత్రం అసాధ్యమని స్పష్టం చేశారు.
Details
చైనాలో ఎన్విడియాకు ఎదురుగాలి
చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియాకు చైనాలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ సంస్థ తయారుచేసిన హెచ్20 చిప్స్ చైనాలో పెద్ద మార్కెట్ కలిగినవి. అయితే తాజాగా చైనా నియంత్రణ సంస్థలు ఈ చిప్స్‌పై సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని ఆరోపిస్తూ ఎన్విడియాకు సమన్లు జారీ చేశాయి. దీనిపై ఎన్విడియా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్పందిస్తూ — హెచ్20 చిప్స్‌లో ఎటువంటి బ్యాక్‌డోర్లు, కిల్ స్విచ్‌లు, స్పైవేర్‌లు లేవని బహిరంగంగా ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య చైనా టెక్ దిగ్గజాలైన అలీబాబా, బైట్‌డ్యాన్స్‌లు హెచ్20 చిప్స్ ఆర్డర్లను పునఃపరిశీలిస్తున్నాయి.